
గురుకుల సొసైటీల ఉద్యోగులకు ఇంకా అందని వేతనాలు
వేతన బిల్లుల ఖరారులో జాప్యంతోనే పరిస్థితి ఇలా...
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి వేతన చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్ పదోతేదీ వచ్చినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల్లోని ఉద్యోగులకు ఇంకా వేతనాలు అందలేదు. సాధారణంగా బీసీ, జనరల్ గురుకుల సిబ్బందికి ప్రతినెలా మొదటివారంలోనే వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేవి. కానీ పది రోజులవుతున్నా, ఇంకా వేతనం అందక ఉద్యోగులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేతన చెల్లింపుల్లో జాప్యాన్ని అరికడుతున్నామని, ప్రతినెలా మొదటి పనిదినం రోజున వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికాలంగా వేతన చెల్లింపులు సజావుగానే జరుగుతున్నాయి. కానీ ఏప్రిల్ నెలలో మాత్రం ఏ ఒక్క సొసైటీలోని ఉద్యోగికి పదోతేదీ వచ్చినా వేతనాలు మాత్రం జమ కాలేదు.
» ఎస్సీ, మైనారిటీ గురుకుల సొసైటీల్లో ఉద్యోగుల వేతన చెల్లింపుల జాప్యానికి ప్రధాన కారణం ఆయా కార్యాలయాల్లోని సెక్షన్ అధికారుల నిర్లక్ష్యమే. వేతన బిల్లులు సాధారణంగా 20వ తేదీకల్లా తయారు చేసి సమర్పిస్తే ఒకటో తేదీన వేతనాలు విడుదలవుతాయి. కానీ ఈ రెండు సొసైటీల్లో కొద్ది నెలలుగా బిల్లుల తయారీ ప్రక్రియ నెలాఖరు వరకు నిర్వహిస్తుండడంతో వేతన చెల్లింపుల్లో సైతం అదే స్థాయిలో జాప్యం జరుగుతోంది.
» మరోవైపు గురుకుల సొసైటీలోని విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు విడుదల కాలేదు. దీంతో ఆయా ఉద్యోగులు సొసైటీ కార్యాలయంలోని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
సొసైటీ కార్యదర్శులకు వినతులు
ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న తీరుపై గురుకుల ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బుధవారం వివిధ ఉద్యోగ సంఘాల నేతలు గురుకుల సొసైటీ కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులకు వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు.
» అన్ని సొసైటీల్లోని ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.బాలరాజు, ప్రధానకార్యదర్శి ఎన్.దయాకర్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
» గురుకుల ఉద్యోగుల వేతనాల్లో జాప్యంతో వారి ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతిన్నదని, ఫలితంగా భవిష్యత్‌లో బ్యాంకు రుణాలకు అర్హత లేకుండా పోతోందని ఆల్ తెలంగాణ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కూకుట్ల యాదయ్య, వై.పాపిరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు.