
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే భారత్ సమ్మిట్ లో వంద దేశాలకు సంబంధించిన 450 ప్రతినిధులు పాల్గొంటున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు. భారతదేశం అలీనోద్యమం తీసుకొని ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని, ఆ దిశగానే సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.
ఈరోజు(గురువారం) హెచ్ఐసీసీ నుంచి మాట్లాడిన భట్టి విక్రమార్క.. ‘ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ఉదయం గం. 7.30ని.ల నుంచి గం.10.30 ని.ల వరకూ ఎన్ఆర్జీసీ పథకం ఫీల్డ్ విజిటింగ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం వివరిస్తాం. 2:45 నుంచి 4 గంటల వరకు తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ కోసం ఏం చేస్తుందనేది వివరిస్తాం. వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో శాంతిని నింపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది.
ఎల్లుండి(శనివారం) సాయంత్రం ఇందిర మహిళ శక్తి బజార్ శిల్పకళ వేదిక సందర్శిస్తాం. పెహల్గామ్ ఉగ్రదాడి దురదృష్టకర సంఘటన. ఈ ప్రాంతాన్ని రేపు రాహుల్ గాంధీ సందర్శిస్తారు. అనంతరం భారత్ సమ్మిట్ కి రాహుల్ గాంధీ హాజరు అవుతారు. అహింస, సత్యాగ్రహ పద్ధతి ప్రపంచం పాటించాలని కోరుకుంటున్నాం. భారత్ సమ్మిట్ ద్వారా వివిధ దేశాల ప్రతినిధులు తెలంగాణకి వస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న వనరుల వివరిస్తాం.
న్యాయం అన్ని వర్గాలకు దక్కాలనేది కాంగ్రెస్ మూల సిద్ధాంతాలు. మా ప్రభుత్వం ద్వారా ప్రపంచానికి ఈ మూల సిద్ధాంతం తెలియజేస్తాం. ప్రగతిశీల భావజాలం ఉన్న, న్యాయ సిద్ధాంతం ఉన్న పార్టీలను ఈ సమ్మిట్ కి ఆహ్వానిస్తాం’ అని భట్టి పేర్కొన్నారు. భారత్ ఫౌండేషన్ సహకారంలో ఈ నెల 25, 26వ తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్‌ఐసీసీ)లో భారత్ సమ్మిట్ 2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.