
ముప్పు తక్కువగా ఉన్న కస్టమర్లకే రుణాల మంజూరు
క్రెడిట్ హిస్టరీ లేనివారికి దూరంగా పరిశ్రమ
రుణ మొత్తాన్నీ కుదించిన ఫిన్‌టెక్ కంపెనీలు
కఠిన నిబంధనలు పాటిస్తున్న సంస్థలు
డబ్బు అవసరం ఉంది.. సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చనుకుంటే కుదరదిక. రుణాల మంజూరులో ఆర్థిక సంస్థలు కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వ్యాపారాన్ని, వినియోగదార్ల సంఖ్యను పెంచుకోవడానికి గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు ఇచ్చిన సంస్థలు రూట్ మార్చాయి. మార్కెట్ ఆశాజనకంగా లేకపోవడంతో తాము ఇచి్చన రుణాలు నిరర్ధక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారకూడదని జాగ్రత్త పడుతున్నాయి.
ఎన్‌పీఏల రిస్క్ నుంచి బయటపడేందుకు క్రెడిట్ స్కోర్‌ను నిక్కచ్చిగా పాటిస్తున్నాయి. ముప్పు తక్కువగా ఉన్న కస్టమర్లకే లోన్స్ మంజూరు చేస్తున్నాయి. మరికొన్ని రుణ సంస్థలు ఒక మెట్టు దిగినప్పటికీ వాహనాలు, కన్యూమర్ డ్యూరబుల్స్ విషయంలో తక్కువ మొత్తం మంజూరు చేయడం లేదా డౌన్‌పేమెంట్ అధికంగా వసూలు చేయడం లాంటివి చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్
కంపెనీల సేఫ్ గేమ్
క్రెడిట్ హిస్టరీ లేనివారు.. అంటే తొలిసారిగా రుణం తీసుకోవాలనుకునే వారిని కంపెనీలు అంత సులభంగా కనికరించడం లేదు. న్యూ టు క్రెడిట్ (ఎన్‌టీసీ) విభాగంలో రెండేళ్లలో లోన్ పొందిన కస్టమర్ల సంఖ్య 54.5% తగ్గిందంటే కంపెనీల సేఫ్ గేమ్‌ను అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 730లోపు ఉన్న వినియోగదార్లకు జారీ చేస్తున్న రుణాల సంఖ్య సైతం క్షీణించింది.
రెండేళ్లలో వీరి వాటా 42 నుంచి 36 శాతానికి వచి్చంది. అదే సమయంలో 731 మించి క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లు 58 నుంచి 64 శాతానికి చేరారు. అంతేకాదు ఏడాదిలో సగటు వ్యక్తిగత రుణ మొత్తాన్ని 2024 డిసెంబర్ నాటికి 20% తగ్గించి రూ.44,000కు చేర్చడం పరిస్థితికి అద్దం పడుతోంది. 2023 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.55,000 ఉండేది.
చిన్న రుణాల్లో ఫిన్‌టెక్ హవా
భారత్‌లో 2024 డిసెంబర్ నాటికి ఫిన్‌టెక్ కంపెనీలు మంజూరు చేసిన రుణాల మొత్తం రూ.1,30,000 కోట్లు. దేశంలోని మొత్తం రుణ పరిశ్రమలో ఫిన్‌టెక్ సంస్థల వాటా కేవలం 1.03 శాతమే. అయినా ఈ కంపెనీలు జారీ చేసిన రుణాలు ఏడాదిలో 32% వృద్ధిని నమోదు చేశాయి. రూ.50,000లోపు విలువ చేసే వ్యక్తిగత రుణాల్లో ఖాతాల సంఖ్య పరంగా ఫిన్‌టెక్ కంపెనీల వాటా ఏకంగా 89 శాతం ఉంది.
ఇక ఫిన్‌టెక్‌లు ఇస్తున్న పర్సనల్ లోన్స్‌లో తక్కువ విలువ చేసే (రూ.50 వేల లోపు) ఖాతాలు 92 శాతం నమోదు చేశాయి. ఈ కంపెనీలు యువత లక్ష్యంగా మారుమూల పల్లెలకూ విస్తరించాయనడానికి ఈ అంకెలే నిదర్శనం. ఫిన్‌టెక్ సంస్థలు వినూత్న సాంకేతికతను ఉపయోగించి ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ చెల్లింపులు, వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీర్–టు–పీర్ లెండింగ్) రుణాల వంటి సేవలను ఆఫర్ చేస్తున్నాయి.
2024 డిసెంబర్ నాటికి భారత్‌లో రిటైల్ రుణాలు ఇలా..
పరిశ్రమ
మొత్తం రుణాలు రూ.1,26,48,000 కోట్లు
రెండేళ్లలో వృద్ధి: 52%
కస్టమర్లు: 27.8 కోట్లు
ఫిన్‌టెక్
మొత్తం రుణాలు రూ.1,30,000 కోట్లు
రెండేళ్లలో వృద్ధి: 145%
కస్టమర్లు: 2.33 కోట్లు