నాయనమ్మ కళ్లలోఆనందం చూడాలని | A man ends life in Suryapet | Sakshi
Sakshi News home page

నాయనమ్మ కళ్లలోఆనందం చూడాలని

Published Thu, Jan 30 2025 4:35 AM | Last Updated on Thu, Jan 30 2025 4:35 AM

A man ends life in Suryapet

వడ్లకొండ కృష్ణను హతమార్చిన బుచ్చమ్మ మనవళ్లు  

ఆపై మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నాయనమ్మకు చూపించిన మనవడు నవీన్‌  

పరువు హత్య కేసులో ఆరుగురి అరెస్ట్‌ 

నలుగురు నిందితులు ఒకే కుటుంబసభ్యులు 

వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌

సూర్యాపేటటౌన్‌ : ‘తన మనవరాలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె నాయనమ్మ తట్టుకోలేకపోయింది. భార్గవి భర్తను ఎలాగైనా అంతమొందించాలని తన ఇద్దరు మనవళ్లను రెచ్చగొట్టింది’అని పోలీసులు చెప్పారు. సూర్యాపేటలో జరిగిన పరువు హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆ వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్‌ మాల బంటి, పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్‌ స్నేహితులు. కృష్ణ తరచు నవీన్‌ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో నవీన్‌ చెల్లెలు అయిన భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి పెళ్లికి భార్గవి కుటుంబసభ్యులు అంగీకరించలేదు.

భార్గవి, కృష్ణ గత ఏడాది ఆగస్టు 7న నార్కట్‌పల్లి మండలంలోని గోపాలాయిపల్లి గుట్టపై వివాహం చేసుకోగా, భార్గవి తల్లిదండ్రులు సూర్యాపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు పెట్టారు. పోలీసులు కృష్ణ, భార్గవికి కౌన్సిలింగ్‌ ఇవ్వగా, తాము మేజర్లమని, ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. కృష్ణ, భార్గవిలు సూర్యాపేటలోనే కాపురం పెట్టారు.
  
మహేశ్‌తో కృష్ణ హత్యకు పన్నాగం 
వడ్లకొండ కృష్ణ, సూర్యాపేటకు చెందిన బైరు మహేశ్‌ స్నేహితులు. దీంతో భార్గవి సోదరులు కోట్ల నవీన్, వంశీలు బైరు మహేశ్‌ దగ్గరకు వెళ్లారు. కృష్ణను చంపేయాలని, నువ్వే నమ్మించి ఎక్కడికైనా తీసుకురావాలని మహేశ్‌ను కోరారు. అందుకు మహేశ్‌ ఒప్పుకున్నాడు. కృష్ణ హత్యకు మూడుసార్లు స్కెచ్‌ వేయగా అది ఫెయిలైంది. ఆ తర్వాత మహేశ్, నవీన్, వంశీలు ఇటీవల కలుసుకొని.. ఈసారి ఎలాగైనా కృష్ణను చంపాలని నిర్ణయించుకున్నారు.

వారి ప్లాన్‌లో భాగంగా ఈ నెల 26న ఆదివారం.. ఇద్దరం కలిసి తమ పొలం దగ్గరకు వెళ్దామని మహేశ్‌ చెప్పగా కృష్ణ అంగీకరించాడు. పథకం ప్రకారం మహేశ్‌ వెంటనే నవీన్‌కు ఫోన్‌ చేసి తాము వస్తున్నం.. అలర్ట్‌గా ఉండమని చెప్పాడు. కృష్ణ స్కూటీపై ఇద్దరూ పొలం వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నారు. 

అయితే, తనకు మూత్రం వస్తుందని చెప్పి మహేశ్‌ కొద్ది దూరం వెళ్లి నవీన్‌కు ఫోన్‌ చేసి, తాను కృష్ణ మెడ అందుకోగానే మీరు రావాలని నవీన్, వంశీకి చెప్పాడు. ఇంటికి వెళ్దామని కృష్ణ స్కూటీని స్టార్ట్‌ చేయగా, మహేశ్‌ స్కూటీ వెనకాల ఎక్కి కూర్చున్నాడు. కృష్ణ స్కూటీని కదిలిస్తుండగా మహేశ్‌.. కృష్ణ మెడ చుట్టూ చేయి వేసి గొంతు నొక్కిపట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కంప్లచెట్లలో దాక్కున్న నవీన్, వంశీ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణను హత్య చేశారు.  

మనవళ్లను రెచ్చగొట్టి...  
భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె నాయనమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొడుతూ పరోక్షంగా కృష్ణ హత్యకు ప్రేరేపించింది. కృష్ణను హత్యచేసిన తర్వాత మొదట శవాన్ని నాయనమ్మకు చూపించాలని నవీన్‌ అనుకున్నాడు. తన ఎర్టీగా కారు డిక్కీలో కృష్ణ శవాన్ని వేసుకొని ఆత్మకూర్‌.ఎస్‌ మండలం పాత సూర్యాపేటలో ఉన్న నాయనమ్మ బుచ్చమ్మ వద్దకు వెళ్లి చూపించాడు. 

అక్కడి నుంచి నవీన్‌ నల్లగొండలోని తన స్నేహితుడు సాయిచరణ్‌ వద్దకు వెళ్లి కారులో ఉన్న కృష్ణ మృతదేహాన్ని చూపించగా వెంటనే చరణ్‌ భయంతో కారు దిగి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పిల్లలమర్రి గ్రామ శివారులో గల చెర్వుకట్ట చివరలో మూసీ కెనాల్‌ పక్కన కృష్ణ శవాన్ని పడేశారు. 

కృష్ణ స్కూటీని కూడా తీసుకొచ్చి పక్కనే పెట్టారు. అక్కడి నుంచి పాత సూర్యాపేటకు వెళ్లి కోట్ల బుచ్చమ్మ ఉన్న ఇంట్లో పడుకున్నారు. మృతుడి తండ్రి డేవిడ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు జరిపి మొత్తం ఆరుగురు నిందితులపై అట్రాసిటీ కేసు, హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

నిందితులపై గతంలో పలు కేసులు 
నిందితులైన ఏ1 నవీన్‌పై గతంలో నాలుగు కేసులు, ఏ2 బైరు మహేశ్‌పై రౌడీషీట్‌తోపాటు తొమ్మిది కేసులు ఉన్నాయి. ఏ3 అయిన నవీన్‌ తండ్రి కోట్ల సైదులుపై ఒక కేసు ఉండగా ఏ4 కోట్ల వంశీపై మూడు కేసులు ఉన్నాయి. ఏ5 కోట్ల బుచ్చమ్మపై రెండు కేసులు ఉన్నాయి. ఏ6 సాయిచరణ్‌పై ఒక కేసు ఉంది. హత్యకు గురైన కృష్ణ అలియాస్‌ మాల బంటిపై మూడు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement