
అది మంచు విష్ణు కార్యాలయంలో దొరికింది
మంచు మనోజ్ ఆరోపణ
మణికొండ: నటుడు మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కారును దొంగిలించారని మనోజ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ నెల 1వ తేదీన రాజస్తాన్‌కు వెళ్లగా జల్‌పల్లిలోని ఫామ్‌హౌస్‌లోకి 150 మంది చొరబడి విధ్వంసం చేశారన్నారు.
తన విల్లా ముందు నిలిపిన మహీంద్రా మరాజో కారును అర్ధరాత్రి దొంగిలించారని చెప్పారు. వెంటనే తన డ్రైవర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడని, పోలీసుల విచారణలో కారు మంచు విష్ణు కార్యాలయంలో లభ్యమైందన్నారు. దుండగులు తన విల్లా గోడలు దూకి వచ్చి ఇంట్లోని విలువైన వస్తువులను పగులగొట్టారని మనోజ్ ఆరోపించారు.
దర్యాప్తు చేస్తున్నాం..
మంచు మనోజ్‌కు చెందిన కారును ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దొంగిలించినట్టు అతని డ్రైవర్ సాంబశివరావు ఫిర్యాదు చేశాడని నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. 2వ తేదీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, గుర్తు తెలియని వ్యక్తులు కారును దొంగిలించినట్టు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కారును దొంగిలించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.