హైదరాబాద్‌లో నటుడు మోహన్‌బాబు ఇంటి వద్ద రోజంతా హైడ్రామా, ఉద్రిక్తత
ఉదయం ‘మంచు టౌన్’ నుంచి సోదరుడు మనోజ్ దంపతులను
బలవంతంగా బయటకు పంపించిన మంచు విష్ణు
న్యాయం చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించిన మనోజ్, మౌనిక
సాయంత్రం మరోసారి ఇంటికి.. 7 నెలల కుమార్తెను అప్పగించాలని డిమాండ్
అడ్డుకున్న సెక్యూరిటీ.. బలవంతంగా లోనికి చొచ్చుకెళ్లిన మనోజ్
చిన్నకొడుకు తీరును తప్పుబడుతూ ఆడియో విడుదల చేసిన మోహన్‌బాబు
ఆపై గేటు వద్ద మీడియా ప్రతినిధిపై మోహన్‌బాబు దాడి
కాలికి గాయం అవడంతో ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లిన విష్ణు
తాజా పరిణామాలపై తండ్రీకొడుకులకు రాచకొండ సీపీ నోటీసులు
నేడు రూ. లక్ష చొప్పున పూచీకత్తుతోపాటు ముగ్గురి తుపాకుల అప్పగింతకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్/పహాడీ షరీఫ్: సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గొడవలు మంగళవారం తారస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం ‘మంచు టౌన్’వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఓవైపు పోలీసులు, మరోవైపు వ్యక్తిగత బౌన్సర్ల మోహరింపు.. తోపులాటలు.. దూషణలు.. మీడియా ప్రతినిధులపై దాడితో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
విష్ణు ఇన్... మనోజ్ ఔట్...
దుబాయ్ నుంచి ‘మంచు టౌన్’కు తిరిగి వచి్చన మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు తొలుత తన సోదరుడు మనోజ్‌తో ఇటీవలి పరిణామాలపై చర్చించారు. అయితే ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఇంటిని అ«దీనంలోకి తీసుకొని మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి సిబ్బంది, బౌన్సర్లను బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ నేపథ్యంలో ఆయా బౌన్సర్ల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణలు జరిగాయి. ఆ ఇల్లు మోహన్‌బాబు పేరిట ఉండటంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మనోజ్..
తనపై దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు రక్షణ కల్పించకుండా పహాడీషరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. తాను ఆస్తి, డబ్బు కోసం పోరాటం చేయట్లేదని.. ఆత్మగౌరవం, భార్యాపిల్లల రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు. ఈ విషయంలో న్యాయం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తానంటూ వ్యాఖ్యానించారు.
అనంతరం శాంతిభద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్‌తోపాటు ఇంటెలిజెన్స్ డీజీ బి. శివధర్‌రెడ్డిని సతీసమేతంగా వెళ్లి వేర్వేరుగా కలిశారు. తనకు అన్యాయం జరుగుతోందని.. న్యాయం చేయాలని.. రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సోమవారం మనోజ్, మోహన్‌బాబు ఇచి్చన పరస్పర ఫిర్యాదులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు కోసం ‘మంచు టౌన్’కు వెళ్లారు. మోహన్‌బాబు నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.
సాయంత్రానికి హీటెక్కిన వాతావరణం...
మోహన్‌బాబు, విష్ణు తమ అనుచరులతో కలిసి మనోజ్ దంపతుల సామగ్రిని బయటకు తరలించడానికి రెండు వాహనాలను సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, మౌనిక తిరిగి ‘మంచు టౌన్’కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన ఏడు నెలల పాప ఇంట్లో ఉందంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా గేట్లు తెరుచుకుని లోపలకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంచు టౌన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు. అక్కడి నుంచి బౌన్సర్లను బయటకు పంపారు. ఈలోగా మోహన్‌బాబు తన చిన్నకుమారుడి తీరును ఆక్షేపిస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అనంతరం గేటు బయటకు వచ్చి అక్కడున్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారు.
దాడిని ఖండించిన జర్నలిస్టులు.. మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలంటూ అక్కడే ధర్నా చేశారు. మరోవైపు మోహన్‌బాబు కాలికి గాయం కావడంతో విష్ణు ఆయన్ను గచి్చ»ౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంలో గాయపడ్డ జర్నలిస్టును పోలీసులు శంషాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాగా, టీవీ9 విలేకరి రంజిత్ ఫిర్యాదు మేరకు మోహన్‌బాబుపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు పోలీసుల ఎదుటకు..
మోహన్‌బాబు, ఆయన కుమారులను బుధవారం ఉదయం 10:30 గంటలకు స్వయంగా తన ఎదుటహాజరుకావాలని రాచకొండ సీపీ సు«దీర్‌బాబు నోటీసులు జారీ చేశారు. అలాగే ముగ్గురి తుపాకులతోపాటు రూ. లక్ష చొప్పున పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు.
గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావు
మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో సందేశంలో మోహన్ బాబు
సాక్షి, హైదరాబాద్: కుటుంబ తగాదాను రచ్చకీడ్చావంటూ చిన్న కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు మండిపడ్డారు. మనోజ్ ప్రవర్తన మొదలు, ఆస్తుల పంపకం వరకు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆడియో సందేశంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
‘నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. గారాబంగా పెంచిన నా గుండెలపై తన్నావు. ఆస్తులు ముగ్గురికీ సమపాళ్లు ఇస్తానా.. గంగపాలు చేస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా వ్యక్తిగతం. అది నా కష్టార్జితం. ఇంట్లో పనిచేసే వాళ్లను ఎందుకు కొడుతున్నావ్? పొట్టకూటి కోసం వచ్చిన వారిని కొట్టడం మహాపాపం. సినీ పరిశ్రమలో మోహన్‌బాబు పరుషంగా ఉంటాడేమో కానీ ఇంట్లో అలా కాదు.
గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. బయటకు వెళ్లావు.. మళ్లీ చేయనని వచ్చావు. నీ భార్య, నువ్వు, మీ అమ్మ... ఇలాంటి పొరపాట్లు చేయమని చెబితే ఇంట్లోకి ఆహ్వానించా. కానీ ఈ విషయం ప్రజలు నమ్ముతారో లేదో. విద్యాసంస్థల బ్యాంకు లావాదేవీల్లో ఏమైనా అవకతవకలు జరిగితే అందుకు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ ఉంది లేదా ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి.
మన విద్యాసంస్థలను ప్రపంచ ఖ్యాతికి తీసుకువెళ్లడానికి విష్ణు తీవ్రంగా కృషి చేశాడు. విద్యాసంస్థలను అభివృద్ధి చేయడానికి వినయ్ అనే వ్యక్తి వస్తే నువ్వు అతనిపై చేయి చేసుకోవడం ఎంతవరకు సబబు? మీ నాన్నకు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే వాళ్లను అడ్డుకుంటున్నావ్. ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా? వినయ్, నీకు మధ్య జరిగిన గొడవలో మీ అన్న విష్ణు అడ్డుపడితే అతన్ని కూడా కొట్టడానికి సిద్ధపడ్డావ్’అని మోహన్‌బాబు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment