
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. ఎల్‌బీ నగర్-అమీర్‌పేట్ మధ్య మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. మియాపూర్- ఎల్‌బీ నగర్ మెట్రో రైలులో సాంకేతిక సమస్య ఏర్పడింది. వెంటనే సిబ్బంది స్పందించి.. సమస్యను పరిష్కరించారు.
అసెంబ్లీ స్టేజీ దగ్గర అరగంట పాటు రైలును నిలిపివేయగా, గాంధీ భవన్ స్టేజీ దగ్గర మరో 10 నిమిషాలు నిలిపివేశారు. అనంతరం యథావిధిగా మెట్రో సేవలు కొనసాగాయి. గతంలోనూ మెట్రో రైలు సర్వీసులకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అంతరాయాలు ఎక్కువగా ఉదయం, రాత్రి ఆఫీసుల నుంచి రాకపోకలు సాగించే సమయాల్లో ఏర్పడుతుండడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు.