
ఆ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం
సీట్ల సంఖ్య పెంచకుండానే పునర్విభజన చేయాలి
ఇందిర, వాజ్‌పేయి విధానాన్ని అనుసరించాలి
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర శాసనసభ విజ్ఞప్తి
అసెంబ్లీలో సీఎం తీర్మానం.. ఏకగ్రీవంగా ఆమోదం
జనాభా ఆధారంగా విభజిస్తే దక్షిణాది ప్రాతినిధ్యం 19 శాతానికి తగ్గుతుంది
అప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం
తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్లు ఎందుకు పెంచరు?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టరాదంటూ సీఎం గురువారం శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. సీఎం ప్రసంగం అనంతరం ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.
తీర్మానంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రులు ఇందిరాగాందీ, వాజ్‌పేయి జనాభా లెక్కన కాకుండా, ఉన్న 543 పార్లమెంటు సీట్లనే కొనసాగిస్తూ పునర్విభజన చేశారని గుర్తుచేశారు. అదే విధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్‌పై పలు వివరాలను సీఎం సభ ముందుంచారు.
సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్లాలి
ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం ఇష్టారీతిగా డీలిమిటేషన్‌ను చేపట్టడం మంచిది కాదని సీఎం అన్నారు. ‘లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు లేకుండా జరుగుతున్న తీరుపై సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని ఈ సభ కోరుతోంది.
కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణను సమర్ధంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన ప్రక్రియ శాపంగా మారకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. ప్రస్తుతం ఉన్న పార్లమెంటు సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేపట్టాలి.
తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ప్రాతినిథ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నిర్దేశించిన మేరకు 119 అసెంబ్లీ స్థానాలను 153కు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తోంది. అందుకే అవసరమైన మేరకు రాజ్యాంగ సవరణలు చేపట్టాలని ఈ సభ కేంద్రాన్ని కోరుతోంది’అని సీఎం తెలిపారు.
గత విధానాలకు విరుద్ధంగా మోదీ చర్యలు
గతంలో నాలుగుమార్లు పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగినప్పుడు అనుసరించిన విధివిధానాలనే రాజ్యాంగంలో పొందుపర్చారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ అందుకు విరుద్ధంగా వెళ్తున్నారని విమర్శించారు. ‘1971 జనాభా లెక్కల తర్వాత పునర్విభజన ప్రతిపాదన వచ్చినప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాం«దీ.. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం చెడిపోతుందని భావించి.. 25 ఏళ్లపాటు పాతవాటినే కొనసాగించాలని నిర్ణయించారు.
ఆ సంఖ్య ప్రకారమే వాటి పునర్విభజన చేయాలని చట్టాన్ని సవరించారు. 543 స్థానాలకుగాను దక్షిణాది 6 రాష్ట్రాల్లో ఉన్న 130 నియోజకవర్గాలను పునర్విభజించారు. 2006 తర్వాత జరిగిన పునర్విభజనలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 42 నియోజకవర్గాలను ఎస్సీ, ఎస్టీ జనాభా ఆధారంగా మొత్తం సంఖ్య పెరగకుండా పునర్వి భజించారు. 2002 జనాభా లెక్కల తర్వాత నాటి ప్రధాని వాజ్‌పేయి కూడా ఇందిరాగాంధీ విధానాన్నే అనుసరించి మరో 25 ఏళ్లపాటు అదే సంఖ్య కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
కానీ ప్రస్తుత ప్రధాని మోదీ మాత్రం అందుకు భిన్నంగా పనిచేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన తెలిపేందుకు ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ప్రజా ప్రతినిధులతో చెన్నైలో సమావేశం నిర్వహించారు. కానీ, కేంద్రం అలాంటి నిర్ణయమే తీసుకోలేదని కొందరు కేంద్ర మంత్రులు అంటున్నారు. వారి మాటలు అర్ధసత్యమేనని నేను చెప్తున్నా’అని పేర్కొన్నారు.
దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం విధించిన జనాభా లక్ష్యాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలుచేస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు విఫలమయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘దక్షిణాదిలో జనన మరణాల మధ్య అంతరం 1.8 శాతం మాత్రమే ఉంది. 543 ఎంపీ సీట్లలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతం. ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే అది 19 శాతానికి తగ్గుతుంది. అప్పుడు దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడుతుంది.
ఇది దక్షిణాదికి క్షేమకరం కాదు. అందుకే రాజకీయాలకు అతీతంగా మనం గళం విప్పాలి. రాష్ట్రంలో భట్టి విక్రమార్క, కేకే, జానారెడ్డిల ఆధ్వర్యంలో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి, ఉమ్మడి మాటగా కేంద్రానికి వినిపించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సభలో ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం.
తెలుగు రాష్ట్రాలపై వివక్ష
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 153కు, ఏపీలో 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినా.. కేంద్రం దాన్ని అమలు చేయలేదు. ఈ విషయాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు 2026లో జనాభా లెక్కల తర్వాతే అది సాధ్యమని బదులిచ్చింది. కానీ, కేంద్రంలోని ప్రధాన పార్టీ తన ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్, సిక్కింలో అసెంబ్లీ స్థానాల పునర్విభజన ప్రక్రియ చేపట్టింది. ఇది ద్వంద్వ వైఖరి కాదా? పార్లమెంటులో 24 శాతం ప్రాతినిథ్యం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు.. పన్నుల రూపంలో జీడీపీకి 36 శాతం సమకూరుస్తున్నాయి.
కానీ తిరిగి కేంద్రం నుంచి మనకు వస్తోంది చాలా తక్కువ. కేంద్రానికి మనం రూపాయి చెల్లిస్తే.. తిరిగి వస్తోంది 42 పైసలు మాత్రమే. అదే బిహార్ ఒక రూపాయి చెల్లిస్తే.. తిరిగి ఆ రాష్ట్రానికి కేంద్రం రూ.6.06 అందిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు రూ.2.73, మధ్యప్రదేశ్‌కు రూ.1.70 చొప్పున అందిస్తోంది. ఇంతకాలం ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్నా, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని వదులుకునేందుకు మనం సిద్ధంగా లేము.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పక్షాలు కలిసికట్టుగా పోరాట ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో అన్ని దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో హైదరాబాద్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు అందులో భాగస్వాములు కావాలి’అని సీఎం పిలుపునిచ్చారు. ఈ తీర్మానంపై సీఎం మాట్లాడిన తర్వాత ఇతర పక్షాల అభిప్రాయాన్ని తీసుకోకుండానే, సభ ఏకగ్రీవంగా ఆమో దించిందని స్పీకర్ ప్రకటించారు.