
వారం రోజుల్లో సుమారు 2 లక్షలకుపైగా అర్జీలు
సర్కిల్ కార్యాయాల్లో ప్రతుల సమర్పణ
కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త రేషన్ కార్డుల(Ration Card) కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మీ సేవ కేంద్రాల(Mee Seva) ద్వారా దరఖాస్తులు నమోదు చేసి వాటి ప్రతులను సివిల్ సప్లయ్ సర్కిల్ కార్యాలయంలో సమర్పిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే సుమారు రెండు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇందులో హైదరాబాద్ పౌరసరఫరాల పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో మంగళవారం నాటికి 92,892, శివారులోని రంగారెడ్డి జిల్లా, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలో మరో 1.1 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా గత నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరణ లేకుండా పోయింది. తాజాగా దరఖాస్తుల స్వీకరణకు అదేశాలు జారీ కావడంతో రేషన్ కార్డులు లేని నిరుపేదలు మీ సేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
కార్డుల సంఖ్యలో పెరిగిపోవడంతో..
పదేళ్ల క్రితం పౌరసరఫరాల శాఖ సంస్కరణలో భాగంగా కొత్త రేషన్ కార్డుల(Ration Card) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కోసం ఈపీడీఎస్ ఎఫ్‌ఎస్‌సీ ఆన్‌లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నిరంతర ప్రక్రియ అంటూ ఆదిలో వచ్చిన దరఖాస్తులు వచ్చినట్లే క్షేత్ర స్థాయి విచారణ జరిపి మంజూరు చేస్తూ వచి్చంది. కార్డుల సంఖ్య పెరిగిపోతుండటంతో మంజూరును నిలిపివేస్తూ దరఖాస్తులు మాత్రం స్వీకరిస్తూ వచ్చింది. దరఖాస్తుల పెండెన్సీ పెరిగిపోవడంతో 2021లో కొత్త వాటి స్వీకరణ ప్రక్రియను నిలిపివేసింది. అప్పటి వరకు వచ వాటిని 360 డిగ్రీల్లో పరిశీలించి అర్హత గల కుటుంబాలకు కార్డులు మంజూరు చేసింది. అప్పట్లో మొత్తమ్మీద దాదాపు 60 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఆన్‌లైన్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల చేసుకునే వెసులుబాటు లేకుండాపోయింది.
ప్రజా పాలనలో..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిర్వహించిన ప్రజాపాలనలో పేద కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చి చేరాయి. వాస్తవంగా అధికారికంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ లేనప్పటికీ పేద కుటుంబాలు ఆరు గ్యారంటీల పథకాలతో పాటు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రభుత్వం కూడా వాటిని ఆఫ్‌లైన్‌ల్లోనే స్వీకరించింది. వాటిని మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. అనంతరం ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డులు లేని కుటుంబాలను గుర్తించి విచారణ జరిపింది. వార్డు సభలు ఏర్పాటు చేసి జాబితా ప్రకటిస్తామని ప్రకటించినప్పటికీ.. తీవ్ర వ్యతిరేకత రావడంతో తిరిగి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణకు సిద్ధమైంది.