
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం కరోనా నిబంధనలు పాటించని మంత్రులపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్‌రెడ్డిలు కరోనా రూల్స్ పాటించకుండా పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. నో సీటింగ్ అని రాసి ఉన్నా అది పట్టించుకోకుండా జగదీష్‌రెడ్డి ఈటల పక్కనే కూర్చొని మాట్లాడారు. దీన్ని గమనించిన పోచారం నో సీటింగ్ అని రాసి ఉన్న దానిలో ఎలా కూర్చుంటారంటూ.. నిబంధనలు పాటించాలంటూ మంత్రి జగదీష్‌నుద్దేశించి హెచ్చరించారు. స్పీకర్ హెచ్చరిచకలతో జగదీష్‌రెడ్డి వెంటనే ఈటెల దగ్గర్నుంచి లేచి తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. సభలో సభ్యులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ పోచారం మరోసారి తెలిపారు.
కాగా సభా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుల మధ్య ఆసక్తికర సంభాషణ చోటచుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి ఎక్కువ సమయం తీసకుంటున్నాడని ఈటెల, ఎర్రబెల్లి ఆయన స్పీచ్‌కు అడ్డుపడ్డారు. ఒక్క ప్రశ్నకు నిరంజన్‌రెడ్డి ఎంత సమయం తీసుకుంటారని ఈటెల, ఎర్రబెల్లిలు ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారిద్దరు స్పీకర్‌కు సమయాన్ని గుర్తుచేశారు. ఇది గమనించిన స్పీకర్ పోచారం నిరంజన్‌రెడ్డిను ఉద్దేశించి తొందరగా ముగించాలని కోరారు. దీంతో నిరంజన్‌రెడ్డి ఒక్క నిమిషంలో తన స్పీచ్‌ను ముగించారు.