
కీలక నిర్ణయం తీసుకున్న రాష్ట్ర అగ్నిమాపక శాఖ
మరో నెల రోజుల్లో అందుబాటులోకి ఈ విధానం
ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదు: డీజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అగ్నిమాపక శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల నిర్మాణానికి ముందు జారీ చేసే తాత్కాలిక నిరభ్యంతర పత్రం (ప్రొవిజినల్ ఎన్‌ఓసీ) జారీ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ పర్యవేక్షణలో ఓ ప్రముఖ సంస్థ రూపొందిస్తున్న ఈ సాఫ్ట్‌వేర్ నెల రోజుల్లో అందుబాటులోకి రానుందని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. నిర్ణీత రుసుం చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రొవిజినల్ ఎన్‌ఓసీ (provisional fire noc) పొందవచ్చని పేర్కొన్నారు.
వీరికి ప్రొవిజినల్ ఎన్‌ఓసీ తప్పనిసరి
రాష్ట్రంలో వాణిజ్య, వ్యాపార అవసరాల కోసం నిర్మించే 15 మీటర్ల కంటే ఎత్తైన, నివాస గృహాలుగా నిర్మించే 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన భవనాలకు ఈ ప్రొవిజినల్ ఎన్‌ఓసీ తప్పనిసరి. వీటితో పాటు 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉండే పాఠశాలలు, సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, మతపరమైన, ప్రజావసరాలకు సంబంధించిన భవనాలకు కూడా ఈ ప్రొవిజినల్ ఎన్‌ఓసీ తీసుకోవడం అనివార్యం. భవన నిర్మాణానికి ముందే దీన్ని పొందాల్సి ఉంటుంది. అగ్నిమాపక శాఖ నుంచి ప్రొవిజినల్ ఎన్‌ఓసీ తీసుకుంటేనే ఇతర విభాగాలు తమ అనుమతుల్ని జారీ చేస్తాయి. ఈ ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసే ముందు ఆయా భవనాలకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు అమలు చేయబోయే ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.
ఆ వివరాలన్నీ పొందుపరచాలి...
భవన నిర్మాణం ప్రారంభానికి ముందే జారీ అయ్యే ఈ ప్రొవిజినల్ ఎన్‌ఓసీ కోసం దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు ఆ ఫైల్‌ను, అందులోని ప్రతిపాదిత భద్రత ప్రమాణాలను పరిశీలిస్తారు. అవసరమైతే మార్పులు, చేర్పులు సూచించి, వాటిని జోడించిన తర్వాతే జారీ చేస్తారు. భవనం ఎత్తు, విస్తీర్ణం, ఎందుకు వినియోగిస్తారు? తదితర అంశాల ఆధారంగా భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఆ భవనానికి ఎన్ని ఫైర్ ఎగ్ట్వింగ్విషర్లు, స్ప్రింక్లర్లు ఎన్ని, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయాలు నిర్దేశించి ఉంటాయి. భవనం భద్రత ప్రమాణాల నమూనా, వాటికి తగ్గట్టు ఉంటేనే ప్రొవిజినల్ ఎన్‌ఓసీ జారీ అవుతుంది. వాటిని తనిఖీ చేసే అధికారి అవసరాలకు తగ్గట్టు ఉన్నాయా? లేదా? అనేది తేలుస్తారు.
చదవండి: హైదరాబాద్‌లో హై అలర్ట్
సాఫ్ట్‌వేర్‌తో ఆటోమేటిక్‌గా...
తాజా సాఫ్ట్‌వేర్‌లో ఈ వివరాలన్నీ ముందే పొందుపరిచి ఉంటాయి. దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుదారుడు భవనం వివరాలు పొందుపరచడంతోపాటు దాని భద్రతా ప్రమాణాల ప్లాన్‌ను ఆటో క్యాడ్ రూపంలో దాఖలు చేస్తాడు. దీన్ని ఆద్యంతం పరిశీలించే సాఫ్ట్‌వేర్ అవసరమైతే తగిన మార్పులు చేర్పుల్ని సూచిస్తుంది. ఈ మేరకు ప్లాన్‌ను మారుస్తూ మరో ఆటో క్యాడ్‌ను అప్‌లోడ్ చేస్తే ప్రొవిజినల్ ఎన్‌ఓసీ జారీ అవుతుంది. ‘కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వస్తే మానవ వనరుల జోక్యం తగ్గుతుంది. తర్వాదా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రొవిజినల్ ఎన్‌ఓసీ దరఖాస్తును పరిశీలించి, మార్పులు, చేర్పుల సూచన వస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పని విధానం పారదర్శకంగా మారి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు’ అని నాగిరెడ్డి పేర్కొన్నారు.