
- ఇలాంటి రికమెండేషన్ లెటర్ ఎన్నడూ చూళ్ళేదు
- మీరు రాకుంటే పోరడు లగ్గం చేసుకోదట
- ఏదోలా చేసుకుని రార్రి సారూ
బాబూ. గణేష్ .. పెళ్లి కుదిరిందట కదా.. మరి ముహుర్తాలు తీసారా.. ఎప్పుడట మరి.. అడిగారు ఊరి జనం.. ఏమో నాకూ తెలీదు.. చెప్పాడు గణేష్.. అదేందిరా అట్లా చెబుతావ్.. ఈనెల.. వచ్చేనెల.. ఆపై వచ్చేనెల ఏదో ఒక రోజు ఉంటుంది కదా.. అది చెప్పు .. రెట్టించి అడిగారు పెద్దలు.. ఏమో.. నాకేం తెలుసు.. ఆయనకు ఎప్పుడు ఖాళీదొరికితే అప్పుడే నా పెళ్లి.. ఓహో.. పురోహితుడు డేట్స్ కుదరలేదా.. అవునులే.. అసలే ఇప్పుడు పంతుళ్ళకు బిజీ ఉంది.. అయన తీరిక దొరికాక ఏదో డేట్ చెబుతాడు.. చేసుకుందువులే.. .. పురోహితుడు కాదు.. వేరే అయన డేట్స్ కుదరాలి.. ఓహో.. అర్థమైందిరా పిల్ల అన్నయ్య అమెరికాలో ఉన్నాడు ఆయనకు సెలవులు.. డేట్స్ దొరకలేదు.. అయన వస్తేగానీ పెళ్లి వద్దన్నారు ఆడపిల్లవాళ్ళు.. అయన వచ్చాకే చేసుకుందువులే.. అన్నారు పెద్దలు.. అది కాదు.. అన్నాడు గణేష్.. మరింకేందిరా.. ఇంకెవరి డేట్స్ కుదరాలి.. రేవంత్ రెడ్డి డేట్స్ కుదరాలి.. చెప్పాడు గణేష్.. వార్నీ.. అదేందిరా అన్నారు పెద్దలు.. అదంతే.. రేవంత్ రెడ్డి వస్తేనే నా పెళ్లి.. లేదంటే లేదు అంటుకుంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు కుర్రాడు..

పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లను ఎవరైనా ఒరేయ్ అబ్బాయ్ నీ పెళ్లి ఎప్పుడురా అంటే ఇదిగో జాబ్ రాగానే చేసుకుంటాను.. ఇదిగో మా మరదలు ఒకే అనడమే లేటు.. అయ్యో.. ఇల్లు పని మధ్యలో ఉంది.. అది పూర్తయ్యాక బ్యాండ్ వాయించడమే.. జీతం తక్కువ ఉంది పెద్దయ్యా.. వచ్చే ఏడాది జీతం పెరగ్గానే చేస్కుంటా.. నువ్వే పిల్లను చూడు... నేనా అమెరికా వెళ్తున్న రెండేళ్లు అక్కడ ఉండి వస్తాను.. రాగానే చేసేసుకుంటా... లేదు బాబాయ్.. పిల్లలు దొరకడం లేదు.. పోనీ నువ్వైనా చూడు.. చేస్కుంటా.. అంటూ సమాధానాలు వస్తాయి.. కానీ ఈ కుర్రాడు మాత్రం.. నీ పెళ్లి ఎప్పుడురా అంటే షాకిచ్చే సమాధానం ఇచ్చాడు..
ఎవరైనా ఎమ్మెల్యేను కలిసి సార్ నాకు ఉద్యోగం చూడండి.. లేదా మంత్రికి చెప్పి ఏదైనా కాంట్రాక్ట్ ఇప్పించండి.. ఇంకా పెద్దాయనకు చెప్పి నాకు మెడిసిన్ సీట్ ఇప్పించండి అని కోరుకుంటారు.. సదరు నాయకుడు కూడా తన కార్యకర్త మాటను గౌరవించి మున్ముందు తనకు ఉపయోగపడే తీరునుబట్టి రికమెండేషన్ చేస్తారు. కానీ ఇదిగో తెలంగాణలోని వైరా నియోజకవర్గానికి చెందిన భూక్యా గణేష్ అనే యూత్ నాయకుడు మాత్రం విచిత్రమైన కోరిక కోరాడు. తన పెళ్ళికి సీఎం రేవంత్ రెడ్డి రావాల్సిందే అని పట్టుబట్టాడు..

అయన ఎప్పుడు వస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటాను అని.. అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాను అని ఫిక్షయ్యాడు. దీంతో ఏకంగా ఎమ్మెల్యే రామ్ దాస్ మాలోత్ కు ఒక లెటర్ రాసాడు.. ఇదిగో అన్నా.. నేను మీ నియోజకవర్గంలో నాయకుణ్ణి పెళ్ళికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే బాధ్యత నీదే అంటూ.. ఒక విజ్ఞాపన అందించాడు.. దాన్ని సదరు ఎమ్మెల్యే సీఎం కు ఫార్వార్డ్ చేసాడు.. మా ఊరి కుర్రాడికి పెళ్లి కుదిరింది.. మీరైతే రావాల్సిందే.. రాకుంటే నాకు ఇజ్జత్ పోయేలా ఉంది.. ఏదైనా చేసి రండి సారూ అంటూ ఆ ఎమ్మెల్యే కూడా సీఎం కు ఆ లెటర్ పంపాడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు డేట్స్ కుదురుతాయో.. భూక్యా గణేష్ పెళ్ళికి.. ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ అవుతుందో చూడాలి.
-సిమ్మాదిరప్పన్న