
పంటల బీమా అమలుకు ప్రభుత్వంకసరత్తు.. ప్రధాని ఫసల్ బీమాపథకాన్ని రాష్ట్రానికి అనుసంధానం చేసే యోచన
విధివిధానాల రూపకల్పనపై అధికారులతో మంత్రి తుమ్మల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓసారి బ్యాంకర్లు, ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించినా, పథకం అమలు ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడం, నష్టపోయిన రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పంటల బీమాపై దృష్టి పెట్టింది.
వచ్చే వానాకాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాన్ని పట్టాలెక్కించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇతర అధికారులతో పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశం నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులందరికీ బీమా అందే విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు.
ఏఏ పంటలకు వానాకాలం, యాసంగిలో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. అయితే కొత్తగా రాష్ట్రం పంటల బీమా పథకాన్ని రూపొందించి అమలు చేయడం కష్టమైన పని కాబట్టి, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రాష్ట్రం చేరే విషయంపై చర్చ జరిగింది. ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తున్నాయో అధ్యయ నం చేసి, రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.
రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించి..
ప్రాథమిక అంచనాల ప్రకారం అధికార యంత్రాంగం పంట నష్టం కలిగే సంభావ్యత ఆధా రంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించింది.
» వానాకాలం సీజన్‌లో సుమారు 128 లక్షల ఎకరాలు పంటలు వేస్తే, వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23 లక్షల ఎకరాలు, పత్తి 44.75 లక్షల ఎకరాలు పోగా మిర్చి, సోయాబీన్, కంది వంటి ఇతర పంటలు కూడా సాగవుతాయి.
» యాసంగి సీజన్‌లో 78 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే, అందులో వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రికి వివరించారు.
» ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2%, యాసంగి పంటకాలంలో 1.5 %, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5% ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమి యంలో రాష్ట్రం, కేంద్రప్రభుత్వం 50:50 భరిస్తుందని తెలిపారు. రైతులందరికీ పంటలబీమా వర్తింపచేయడం వల్ల స్థూల పంట విస్తీర్ణంలోని 98% విస్తీర్ణానికి బీమా వర్తిస్తుందని అధికారులు వివరించారు.
రైతులందరికీ మేలు జరిగేలా బీమా: తుమ్మల
వాతావారణ మార్పుల వలన కలిగే పంట నష్టాన్ని పంటల బీమాతో కొంతవరకు భర్తీ చేసే అవకాశం కలుగుతుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. దిగుబడి ఆధారిత బీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు, వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాటా, బత్తాయి మొదలైన పంటలకు బీమా వర్తింపచేసే అవకాశం ఉందన్నారు.
పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షంతో నష్టపోయే వరి మరియు మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.