
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పరిధిలోని బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్.. తుది దశ విచారణ మొదలుపెట్టింది. మే రెండో వారం వరకు విచారణ కొనసాగించనుంది. మే రెండో వారంలో ప్రభుత్వానికి తుది రిపోర్ట్‌ను ఇవ్వనుంది. ఇప్పటి వరకు 400 పేజీల రిపోర్ట్ సిద్ధం చేసిన కమిషన్.. దాదాపు 90 శాతం రిపోర్ట్ పూర్తి చేసింది. ఇంకా కమిషన్‌కు ఎన్‌డీఎస్‌ఏ ఫైనల్ రిపోర్ట్ అందకపోవడంతో ఆ నివేదిక కోసం ఎన్‌డీఎస్‌ఏకి కమిషన్ లేఖ రాసింది. ఫైనల్ రిపోర్ట్ కోసం ఎన్‌డీఎస్‌ఏ మరో మూడు వారాల సమయం కోరింది.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ కీలక దశకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తీసుకున్న నిర్ణయాల్లో కీలకపాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి ప్రశ్నించాల్సి ఉంది.
ఈ దఫాలోనే వారికి సమన్లు పంపించి క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కావాలని కమిషన్ కోరే అవకాశముంది. ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించి కీలక సాక్ష్యాధారాలు సేకరించిన విషయం తెలిసిందే. వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల ముందు ఉంచి ప్రశ్నించనున్నట్టు తెలిసింది.