గుర్తు లేదు..మరిచిపోయిన! | justice pc ghose commission cross examined some people regarding kaleshwaram projec | Sakshi
Sakshi News home page

గుర్తు లేదు..మరిచిపోయిన!

Published Sat, Sep 21 2024 5:36 AM | Last Updated on Sat, Sep 21 2024 5:36 AM

justice pc ghose commission cross examined some people regarding kaleshwaram projec

జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఎదుట నీళ్లు నమిలిన ఇంజనీర్లు

సాక్షి, హైదరాబాద్‌: ‘నాకు తెలియదు.. గుర్తు లేదు..మర్చిపోయిన..’కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ వేసిన ప్రశ్నలకు కొందరు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెప్పిన వింత సమాధానాలు ఇవి. తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ లే»ొరేటరీ(టీఎస్‌ఈఆర్‌ఎల్‌) చీఫ్‌ ఇంజనీర్‌గా వ్యవహరించిన శ్రీదేవిని కమిషన్‌ ఏ ప్రశ్న అడిగినా ‘తెలీదు..గుర్తు లేదు’అని సమాధానాలివ్వగా, కమిషన్‌ ఆమెపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. 

బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన మోడల్‌ స్టడీస్‌ విషయంలో కీలకపాత్ర పోషించిన ఆమెపై కమిషన్‌ ప్రశ్నల వర్షం కురిపించగా, సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమిలారు. బరాజ్‌లను నిర్మించడానికి ముందే మోడల్‌ స్టడీస్‌ చేశామని తొలుత చెప్పిన ఆమె, ఆ వెంటనే మాట మార్చారు. దీంతో మీరు ఇచ్చిన అఫిడవిట్‌లోని సమాచారానికి సైతం కట్టుబడి ఉండకపోతే ఎలా? అని ఆమెపై కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో పలువురు ఇంజనీర్లకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించింది. 

స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌(ఎస్డీఎస్‌ఓ) సీఈగా సైతం శ్రీదేవి వ్యవహరించగా, ఆ పోస్టులో ఉండి బరాజ్‌ల పరిరక్షణకు ఐఎస్‌ కోడ్‌ను అమలు చేశారా? అని కమిషన్‌ ప్రశ్నించగా, మౌనంగా ఉండిపోయారు.  

బరాజ్‌లకు వరదలు ఎప్పుడొచ్చాయన్న ప్రశ్నకు సైతం తెలియదు అని బదులిచ్చారు.  
బరాజ్‌లకు 2020లో త్రిడీ మోడల్‌ స్టడీస్‌ నిర్వహించినట్టు ఆమె చెప్పగా, 2023లో జరిగినట్టు టీఎస్‌ఈఆర్‌ఎల్‌ నివేదిక ఇచి్చందని కమిషన్‌ ఆమెకు తెలియజేసింది. అయితే ఆ విషయం తనకు గుర్తు లేదని ఆమె బదులివ్వడంతో కమిషన్‌ అసహనం వ్యక్తం చేసింది.  

బరాజ్‌లకు తనిఖీలు చేయలేదు  
బరాజ్‌ల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని ఎస్డీఎస్‌ఓ సీఈ ప్రమీళను కమిషన్‌ ప్రశించగా, ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని ఆమె బదులిచ్చారు. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ అమల్లోకి వచి్చనా బరాజ్‌ల భద్రత వాటి చీఫ్‌ ఇంజనీర్‌దేనని స్పష్టం చేశారు. గేట్ల నిర్వహణలో మ్యానువల్స్, బరాజ్‌ల నిర్వహణ ప్రొటోకాల్స్‌ అమలు చేశారా? అని కమిషన్‌ ప్రశ్నించగా, ఆమె సమాధానమివ్వడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో పేర్లు చెప్పకుండా వివరాలు తెలపాలని కమిషన్‌ ఆమెను కోరింది. చట్టం ప్రకారం వర్షకాలానికి ముందు, తర్వాత తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వలేదని ఆమె వివరించారు.  – ఎస్‌స్డీఎస్‌ఓ ఈఈ విజయలక్ష్మి సైతం ఇదే విషయాన్ని కమిషన్‌కు తెలిపారు.  

అధ్యయనాలు, నిర్వహణ లేకపోవడమే కారణం  
బరాజ్‌ల వైఫల్యానికి కేవలం నిర్వహణ, పర్యవేక్షణ లోపాలే కాకుండా వాటికి ఎగువ, దిగువన రక్షణ చర్యలు తీసుకోకపోవడం కూడా కారణమేనని సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) ఈఈ రఘునాథ శర్మ తెలిపారు. 2019 లోనే వరదల తర్వాత బరాజ్‌లలో లోపాలు బయటపడగా, 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బరాజ్‌ కుంగే వరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. వైఫల్యానికి కారకులు ఎవరు? నాటి ప్రభుత్వ అధినేతనా? అని కమిషన్‌ అడగ్గా, 3డీ మోడల్‌ అధ్యయనాలు జరపకపోవడం, నిర్వహణ ప్రొటోకాల్స్‌ పాటించకపోవడం కారణమని ఆయన బదులిచ్చారు. 

మోడల్‌ స్టడీస్‌ పూర్తికాక ముందే బరాజ్‌ల నిర్మాణం ప్రారంభించడంతోనే విఫలమయ్యాయని పలువురు టీఎస్‌ఈఆర్‌ఎల్‌ ల్యాబ్‌ ఇంజనీర్లు కమిషన్‌కు తెలిపారు. బరాజ్‌లను నీటి మళ్లింపుకోసం నిర్మిస్తారని, నిల్వ చేయడంతోనే కుంగిపోవడం, సీపేజీలు ఏర్పడడం జరిగిందన్నారు. వరదల సమయంలో కూడా గేట్లు మూసి ఉంచడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement