
టోక్యోలో జపాన్ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్
సీఎం సమక్షంలో రెండు సంస్థలతో ‘టామ్‌కామ్’ ఒప్పందాలు
వచ్చే ఒకటి రెండేళ్లలో 500 ఉద్యోగాలకు అవకాశం
రాష్ట్రాభివృద్ధికి జపాన్‌లోని తెలుగువారు సహకరించాలన్న సీఎం రేవంత్
టోక్యోలో తెలుగు సమాఖ్య సమావేశానికి హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నైపుణ్యం ఉన్న యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా అక్కడి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జపాన్‌లో అధిక ఉద్యోగావకాశాలున్న రంగాలను గుర్తించి, ఆయా ఉద్యోగాలకు తెలంగాణ యువతను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)’ ద్వారా పంపించడానికి వీలుగా అక్కడి రెండు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
జపాన్‌కు చెందిన టెర్న్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్ గ్రూప్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో టామ్‌కామ్ శనివారం ఈ ఒప్పందాలు కుదుర్చుకుంది. అంతకుముందు జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారుల బృందం ఆ రెండు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. కాగా టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్‌వేర్, ఇంజనీరింగ్, స్కిల్డ్ వర్కర్ రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో నియామకాలు చేపడుతుంది.
ఇక రాజ్ గ్రూప్ జపాన్‌లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ త్సుకుయి కార్పొరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో గతంలో టామ్‌కామ్‌తో కలిసి పని చేసింది. తాజా ఒప్పందంతో హెల్త్ కేర్ రంగంలో పాటు ఇతర రంగాల్లోనూ సహకారం విస్తరించనుంది. ఈ రెండు జపనీస్ సంస్థలు రాబోయే ఒకటి నుంచి రెండు సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగ అవకాశాలను తెలంగాణ యువతకు అందించనున్నాయి.
హెల్త్‌కేర్, నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ రంగంలో (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 100 ఉద్యోగాలు, హాస్పిటాలిటీ రంగంలో 100 ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో (సివిల్ ఇంజనీరింగ్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామగ్రి నిర్వహణ) 100 ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆ సంస్థల ప్రతినిధులు వివరించారు.
మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నారు: సీఎం
తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని, త్వరలోనే తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. టోక్యోలోని తెలుగు సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్‌ను పరిశీలించామని, తాము రాష్ట్రంలో మూసీ నది ప్రక్షాళన చేయాలని భావిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని చెప్పారు. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొందని, కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్తంభించే పరిస్థితులు ఉత్పన్నం అవుతుంటే, అది చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అని సీఎం ప్రశ్నించారు.
మూసీ, మెట్రో, ట్రిపుల్ ఆర్ కీలకం
‘హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెబుతున్నా. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు. తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి. పరిశ్రమలు పెరగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగితే ప్రపంచంతోనే మనం పోటీ పడొ చ్చు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆ నందం ఏమిటో మీకు తెలుసు..’ అని రేవంత్ అన్నారు.