
నిర్బంధాల నడుమ నిత్యపోరాటాల బాటన సాగిన చరిత్ర
ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం సాగిన సమరం
తెలంగాణ గడ్డపై ఉద్యమ గానం, సమర గీతం కేసీఆర్
ప్రజా హృదయ స్పందనకు అద్దం, ఉద్యమ కాగడా టీఆర్‌ఎస్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995కు అటూ ఇటుగా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. వర్షాభావ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు ప్రజల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరిట చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచడం, అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వారిపై జరిగిన ‘బషీర్‌బాగ్ కాల్పులు’ఘటనలో ముగ్గురు మరణించడం నాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తీవ్రంగా కలిచివేసింది.
విద్యుత్ చార్జీల పెంపుతో తెలంగాణ రైతులు ఎదుర్కొనే దయనీయతను వివరిస్తూ 2000 సంవత్సరంలో చంద్రబాబుకు కేసీఆర్ బహిరంగలేఖ రాశారు. ఈ నేపథ్యంలో నుంచే తెలంగాణకు స్వీయ అస్థిత్వం కలిగిన రాజకీయ పార్టీ అవసరమనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న ‘జలదృశ్యం’సాక్షిగా 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఆవిర్భవించింది.
శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఏకకాలంలో కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు విశ్రమించేది లేదని..మధ్యలో విరమిస్తే తనను రాళ్లతో కొట్టి చంపమని కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 2001 మే, 17న కరీంనగర్‌లో సింహగర్జన పేరిట నిర్వహించిన సభకు భారీ స్పందన లభించింది.
సిద్దిపేట ఉపఎన్నికతో బరిలోకి
కేసీఆర్ రాజీనామాతో 2001 సెపె్టంబర్ 22న సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తొలిసారిగా టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కేసీఆర్ 58,712 మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు టీఆర్‌ఎస్ ఏర్పడిన కొద్ది నెలల్లోనే 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. పార్టీ ఏర్పడిన మూడు నెలల్లోనే 25 శాతం ఓటు బ్యాంకును సాధించింది.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న టీఆర్‌ఎస్.. ఆ ఎన్నికల్లో 26 ఎమ్మెల్యే, ఐదు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. తర్వాతి కాలంలో టీఆర్‌ఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్ మంత్రిగా, ఆలె నరేంద్ర సహాయమంత్రిగా చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ చేరింది.
రాజీనామాల పర్వం..
తెలంగాణపై కాంగ్రెస్ నాని్చవేత ధోరణిని నిరసిస్తూ 2005 జూలైలో రాష్ట్ర కేబినెట్, 2006 ఆగస్టు 22న కేంద్ర కేబినెట్ నుంచి టీఆర్‌ఎస్ మంత్రులు వైదొలిగారు. 2006 సెపె్టంబర్ 12న కరీంనగర్ ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబర్ 4న జరిగిన ఉపఎన్నికలో కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 2.01లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2008 మార్చి 3న టీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికలో కేసీఆర్‌తో సహా ఇద్దరు ఎంపీలు, ఏడుగురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు మాత్రమే ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో 2009 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని మహాకూటమితో టీఆర్‌ఎస్ పొత్తు కుదుర్చుకుంది.
కేసీఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో..: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెపె్టంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తూ 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో ఆందోళనలకు దారితీసింది. ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’పరిష్కారం అని నినదించారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో ’అంటూ 2009 నవంబర్ 29 నుంచి సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు.
11 రోజుల పాటు కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగడంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గిన కేంద్రం సంప్రదింపుల పేరిట 2009 డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది. దీంతో సరికొత్త వ్యూహానికి పదును పెడుతూ కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తూ జేఏసీని ప్రతిపాదించారు.
స్వరాష్ట్ర కల సాకారం.. తొలిసారి అధికారం..: సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా 2014 ఫిబ్రవరి 17న లోక్‌సభలో, 20న రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ మనుగడలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి 11 చోట్ల గెలుపొంది లోకసభలో ఎనిమిదో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 119 అసెంబ్లీ స్థానాలకుగాను 63 చోట్ల గెలుపొంది సొంత బలంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా 2014, జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు.
ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్‌ఎస్..: రాష్ట్ర సాధన లక్ష్యంగా అవతరించిన టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. రాజకీయ పునరేకీరణ పేరిట 2014–18 మధ్యకాలంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలను ప్రోత్సహించారు. బీఆర్‌ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరిట ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంది.
అధికార పీఠం నుంచి ప్రతిపక్ష స్థానానికి..: జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం పార్టీ పేరును మార్చుకొని పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకున్న బీఆర్‌ఎస్‌కు 2023 డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆ ఎన్నికల్లో 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. పార్టీ అ«ధ్యక్షుడు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు. పార్టీ ఆవిర్భవించిన 25 ఏళ్లలో బీఆర్‌ఎస్‌కు తొలిసారిగా లోక్‌సభ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 2014లో 11, 2019లో 9 సీట్లలో గెలుపొంది లోక్‌సభలో ఎనిమిదో స్థానంలో నిలిచిన బీఆర్‌ఎస్.. 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 17 స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయింది.
ఫిరాయింపులతో ఉక్కిరిబిక్కిరి..: అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి నేతలు కూడా హస్తం గూటికి వెళ్లారు. పార్టీలో సెక్రటరీ జనరల్ పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యుడు కేకే ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. పలువురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ సుప్రీంను ఆశ్రయించింది. దానిపై విచారణ జరుగుతోంది.
