
2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
ఏర్పేడు(రేణిగుంట): 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉందని 16వ ఆర్థిక సంఘం చైర్మన్, తొలి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డా.అరవింద్ పనగారియా అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీని ఆయన గురువారం సందర్శించారు. ‘భారతదేశం గ్లోబల్ ఎకానమీలో తదుపరి దశాబ్దం’ అనే అంశంపై ఆయన ఐఐటీ హ్యూమానిటీస్ – సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఆయనకు ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్.సత్యనారాయణ స్వాగతం పలికి 3వ జనరేషన్ ఐఐటీగా తిరుపతి ఐఐటీ ప్రస్థానం గురించి, పదేళ్లలో ఐఐటీ సాధించిన ప్రగతిని గురించి ఆయనకు వివరించారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు, ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మనోజ్ పాండా, ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రొఫెసర్ అరవింద్ పనగరియా మాట్లాడుతూ రెండు దశాబ్దాలలో భారత్ ఎన్నో సంక్షోభాలను అధిగమించి 8–9 శాతం వృద్ధి రేటు సాధించినట్టు వెల్లడించారు. అటల్ సేతు, కొత్త పార్లమెంట్ భవనం వంటి ప్రాజెక్టులు దేశ సామర్థ్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశంలో 9–10 ట్రిలియన్ ఎకానమీగా మారే అవకాశం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో జరుగుతున్న మార్పులు, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా రూపుదిద్దుకున్న మూడవ తరం ఐఐటీ పురోగతిని వివరించారు. విద్యార్థులలో మూడవ వంతు మంది పీహెచ్‌డీ ప్రోగ్రాములలో ఉన్నారని, అధ్యాపకులు 200 కి పైగా పరిశోధన ప్రాజెక్టులలో పాల్గొంటున్నారని తెలిపారు.