
శ్రీకాళహస్తిలో అధికారపార్టీ నేత బెదిరింపులతో బెంబేలెత్తుతున్న అధికారులు
ఇవ్వకపోతే ఉద్యోగం చేయలేరు
ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు నెలకు రూ.10 లక్షలు ఇవ్వాలి
లేదంటే ఒక్కో డాక్యుమెంట్‌కు వసూలు చేస్తా
రెవెన్యూ అధికారుల నుంచి నెలనెలా మామూళ్లు
టీడీపీ నేత నిర్వాకంతో పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో అధికారపార్టీ నాయకుడి దందాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ‘మీరేమైనా చేసుకోండి. నా వాటా నాకు రావాల్సిందే. నెలనెలా వాటా రాకపోతే ఏం జరిగినా నాకు సంబంధం లేదు’ అంటూ అధికారులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు. చేసేది లేక అధికార పార్టీ నాయకుడు చెప్పినట్లు ఆయన వాటా ఆయనుకు పంపిస్తున్నారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికారులకు పోస్టింగ్‌ల ఇచ్చేందుకు ప్రతి అధికారి నుంచి మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, మట్టి, కంకర అక్రమ రవాణాదారుల నుంచి నెలనెలా మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆక్రమించుకున్న భూములను ఆన్‌లైన్ చేయించాలన్నా ఆ నాయకుడికి మామూళ్లు ఇవ్వాల్సిందే. నియోజకవర్గంలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఆరితేరిన ఓ సబ్ రిజిస్ట్రార్‌కు తిరిగి పోస్టింగ్ ఇప్పించేందుకు భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. అదే సబ్‌రిజిస్ట్రార్ ద్వారా మిగిలిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నెలనెలా మామూళ్లు ఇప్పించే బాధ్యతను కూడా అప్పగించారనే ప్రచారం జరుగుతోంది.
రియల్టర్ల నుంచి మామూళ్లు
నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా.. ఆ నాయకుడికి మామూళ్లు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే.. వెంచర్‌లోకి అధికారులను పంపించి బెదిరింపులకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ రియల్టర్‌ని ఇంటికి పిలిపించి.. వెంచర్‌లో ఎన్ని ప్లాట్లు ఉంటే.. అంత మామూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఆ రియల్టర్ భయపడి క్రయవిక్రయాలు చేయడం మానేసినట్లు టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. ఆ నాయకుడి దెబ్బకు నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని చర్చించుకుంటున్నారు. తానేం తక్కువా అనుకున్నాడేమో.. ఆ నాయకుడి డ్రైవర్ కూడా గ్రామాల్లో ఆక్రమణలు, ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా ఉంటూ.. వారి నుంచి మామూళ్లు వసూళ్లు చేసుకుంటుండడం కొసమెరుపు.
నెలవారీ కప్పం కుదరదని చెప్పడంతో..
నియోజకవర్గంలో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లంతా ఆయనకు నెలవారీ కప్పం కట్టాలకు హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. జాయినింగ్ సమయంలోనూ పెద్ద మొత్తంలో ముడుపులిచ్చి.. మళ్లీ నెలవారీ మా మూళ్లు ఒక్కో సబ్ రిజిస్ట్రార్ రూ.10 లక్షలు ఇవ్వాలని, అందరి నుంచి నెలవారీ కప్పం వసూలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత నియోజకవర్గంలోని ఓ సబ్ రిజిస్ట్రార్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే తన పరిధిలో రిజిస్ట్రేషన్లు తక్కువగా జరుగుతున్నాయని, అంత మొత్తం ఇచ్చుకోలేమని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు తేల్చిచెప్పారు.
ఆ మాట జీర్ణించుకోలేని ఆ నేత తనదైన శైలిలో హైడ్రామా నడిపారు. ఓ సబ్ రిజిస్ట్రార్‌ని తీవ్ర స్థాయిలో బెదిరించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కో డాక్యుమెంట్‌కి ఎంతెంత తీసుకుంటున్నారో తనకు తెలియదా? డబ్బులు తీసుకుని కూడా పనులు చేయడం లేదని అధికారులపై చిందులేశారు. అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న కార్యాలయ సిబ్బంది అవాక్కయ్యారు. చేసేది లేక ఇకపై ప్రతినెలా అడిగినంత సమర్పించుకునేందుకు సిద్ధమయ్యారు. మరో సబ్ రిజిస్ట్రార్‌ని పిలిపించి.. ప్రతి డాక్యుమెంట్‌కు తీసుకునే మామూళ్లలో తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో తుక్కు వ్యాపారుల వద్ద, ఇసుక, మైనింగ్, మట్టి మాఫియా, రియల్టర్లు నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ నేత విషయాన్ని జనసేనకు చెందిన వారు, టీడీపీలోని మరికొందరు సీఎం చంద్రబాబుకు, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్‌కి ఫిర్యాదు చేసినటు సమాచారం.