Telangana News: ప్రచారం.. ఉధృతం
Sakshi News home page

ప్రచారం.. ఉధృతం

Published Thu, Oct 19 2023 2:02 AM | Last Updated on Thu, Oct 19 2023 9:40 AM

- - Sakshi

యాదాద్రి: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలు సైతం జోరు పెంచాయి. భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఆలేరు, నకిరేకల్‌ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు కావడంతో వారు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు.

ఇక భువనగిరి, మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ కుంభం అనిల్‌ కుమార్‌రెడ్డి, చల్లమల కృష్ణారెడ్డి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ సంస్థాగతంగా సమావేశాలు నిర్వహిస్తోంది.

బీఆర్‌ఎస్‌లో జోష్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 16వ తేదీన భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభ విజయవంతం కావడంతో కేడర్‌లో జోష్‌ నెలకొంది. ఉత్సాహంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు.

భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగుతుర్తిలో గాదరి కిశోర్‌కుమార్‌, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లను నేరుగా కలుస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

అలకలు.. బుజ్జగింపులు
అధికార బీఆర్‌ఎస్‌ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచా రాన్ని ముమ్మరం చేసింది. అయితే కొంతమంది నాయకులు, ద్వితీయ శ్రేణి కేడర్‌ వివిధ కారణాలతో అలకబూని ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. వారిని బుజ్జగించేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగారు. వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి చర్చలు జరిపి ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు.

ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంనుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నా తమకు ఒరిగిందేమీ లేదని నేరుగానే ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని, తమను నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ క్షేత్రస్థాయి సమావేశాలు
బీజేపీ నేడో, రేపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ ఇప్పటికే విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించిది. మరోమారు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. రెండు రోజుల క్రితం భువనగిరి, ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించింది.

పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన తీరుపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎన్నికల ఇన్‌చార్జ్‌ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. భువనగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు.

ఇక్కడ మరో నాయకుడు పాశం భాస్కర్‌ కూడా టికెట్‌ రేసులో ఉన్నారు. ఆలేరులో పడాల శ్రీనివాస్‌, సూదగాని హరిశంకర్‌గౌడ్‌, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే ప్రచారం చేయనున్నారు.

ఆలేరు, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ జోరు
కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య, నకిరేకల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో వారు ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. బీర్ల అయిలయ్య ప్రచారం కొనసాగిస్తూనే చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టికెట్‌ ఖరారు కావడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు.

సోమవరం రామన్నపేటలో కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇక భువనగిరి, మునుగోడు టికెట్‌లను కాంగ్రెస్‌ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ తమకే టికెట్‌ వస్తుందన్న నమ్మకంతో భువనగిరి నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మనుగోడులో చల్లమల కృష్ణారెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారంటీ స్కీంలను గడపగడపకు తీసుకెళ్తున్నారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలను సైతం ఎండగడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement