
జలాశయంలో ఈతకు వెళ్లి వ్యక్తి దుర్మరణం
మైలవరం : వేముల మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం (53) అనే వ్యక్తి మైలవరం జలాశయంలో ఈతకు వెళ్లి ఆదివారం సాయంత్రం దుర్మరణం చెందాడు. మైలవరం పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములకు చెందిన షేక్ ఇబ్రహీం జమ్మలమడుగు పట్టణంలో జరిగే హజరత్ సయ్యద్ షా గూడుమస్తాన్ వలీ ఉరుసు ఉత్సవానికి వేముల నుంచి శనివారం గూడెంచెరువు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం మైలవరం మండలంలోని గైబుసా స్వామి కొండకు వెళ్లి అక్కడ చదివింపులు చేసుకుని మధ్యాహ్నం సమయంలో కుటుంబ సభ్యులతో కలసి మైలవరం జలాశయానికి వచ్చాడు. జలాశయంలో ఈతకు వెళ్లి అక్కడి మట్టిలో కూరుకుపోయాడు. ఎంత సేపటికి బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మైలవరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శ్యాంసుందర్‌రెడ్డి, సిబ్బందితో కలసి జాలర్లను రప్పించి మృతదేహన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు.