Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan congratulates local government representatives of YSR Anantapur and Tirupati districts1
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్‌ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమా­వేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహ­ల్గాంలో ఉగ్ర­వాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్‌ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమా­వేశంలో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్‌..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్‌ బుక్‌ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యా­లకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్‌ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్‌సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్‌ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయ­పెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్‌ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్‌ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్‌సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్‌ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్‌ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్‌సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్‌సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్‌సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్‌ టాపిక్‌ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్‌ సిక్స్‌లు, సూపర్‌ సెవెన్‌లు ఎందుకు లేవు? గతంలో జగన్‌ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్‌ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపో­యామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్‌ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్‌ కొట్టేలా పెంచిన కరెంట్‌ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్‌ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్‌ డైవర్షన్‌ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్‌ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్‌ అని గేమ్స్‌ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్‌ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్‌ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్‌ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్‌సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్య­క్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్‌ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్‌ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్‌ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్‌సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్‌ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. రెండేళ్లు కోవిడ్‌ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది.

Tensions between India and Pakistan are reaching a peak level2
యుద్ధమేఘాలు!

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌ నడుమ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై పాక్‌ గంగవెర్రులెత్తిపోయింది. ఇది తమపై నేరుగా యుద్ధ ప్రకటనేనంటూ గగ్గోలు పెట్టింది. ప్రతీకారంగా నామమాత్రపు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్‌ చేసి అక్కసు తీర్చుకుంది. భారత్‌కు తన గగనతలాన్ని మూసేయడమే గాక వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బీరాలు పలికింది. ఎడాపెడా క్షిపణి పరీక్షలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సరిహద్దుల వెంబడి సైనిక మోహరింపులను కూడా యుద్ధ ప్రాతిపదికన భారీగా పెంచేస్తోంది. మరోవైపు దాయాది ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో ‘నిర్ణాయక చర్య’లకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గురువారం చోటుచేసుకున్న పలు కీలక పరిణా మా లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. గురువారం శ్రీనగర్‌లోని మార్కెట్‌ ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ తాజా పరిస్థితిని వివరించడంతో పాటు పలు ‘ఇతర’ అంశాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీ కూడా పహల్గాం ముష్కరులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారికి దన్నుగా నిలిచిన దుష్టశక్తినీ కటినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఊహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకు ని తీరతాం’’ అంటూ ప్రతినబూనారు. తర్వాత కా సేపటికే ‘ఆక్రమణ్‌’ పేరిట సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది. అత్యాధునిక రఫేల్‌తో పాటు సుఖోయ్‌ తదితర యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. మరోవైపు పాక్‌లో ఉన్న భారతీయులు తక్షణం తిరిగి రావాలంటూ కేంద్రం అడ్వై జరీ జారీ చేసింది. పొరుగు దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేయడమే గాక దానిపై తీసుకోబోయే ‘కఠిన’ చర్యలకు జీ20 తదితర దేశాల మద్దతు కూడగడుతోంది. పహల్గాం ఆటవిక దాడి, అందులో పాక్‌ ముష్కరులు పాల్గొన్న వైనం తదితరాలను జీ20 సభ్య దేశాల రాయబారులకు విదేశాంగ శాఖ పూసగుచ్చినట్టు వివరించింది. భేటీకి హాజరైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆ్రస్టేలియా, యూఏఈ తదితర దేశాల రాయబారులు దాడిని తీవ్రంగా ఖండించాయి. పాక్‌కు కరుడుగట్టిన మద్దతుదారైన చైనా కూడా భేటీలో పాల్గొనడమే గాక భారత్‌కు మద్దతు పలకడం విశేషం. మరోవైపు పహల్గాం దాడి, తదనంతర పరిస్థితులను కాంగ్రెస్‌ తదితర పార్టీలన్నింటితో కేంద్రం పంచుకుంది. ఉగ్ర తండాలను శాశ్వతంగా నిర్మూలించి తీరాల్సిందేనని పార్టీలన్నీ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డాయి. అందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా నిలుస్తామని అఖిలపక్ష భేటీలో ప్రకటించాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, దానికి తోడుగా యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ సూరత్‌ పాక్‌ దిశగా కదులుతున్నట్టు సమాచారం.

Rasi Phalalu: Daily Horoscope On 25-04-2025 In Telugu3
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. ఆస్తిలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.8.21 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర తె.4.25 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి రేవతి, వర్జ్యం: ప.2.49 నుండి 4.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.14 వరకు,అమృత ఘడియలు: రా.11.47 నుండి 1.17 వరకు.సూర్యోదయం : 5.42సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకుయమగండం : ప.3.00 నుండి 4.30 వరకు మేషం....వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.వృషభం....ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.మిథునం...భూవివాదాలు తీరతాయి. వాహనసౌఖ్యం. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.కర్కాటకం....వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.సింహం....పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి.కన్య...పొరపాట్లు సరిదిద్దుకుని పనులు చక్కదిద్దుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సానుకూలత.తుల...ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవదర్శనాలు చేసుకుంటారు.వృశ్చికం....పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.ధనుస్సు..ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ తప్పదు.మకరం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటాయి.కుంభం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. ఆ«లయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొత్త సమస్యలు. శ్రమ పెరుగుతుంది.మీనం...కార్యజయం. ఆస్తివివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆధ్యాత్మిక చింతన వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనయోగం.

Website not open for some school assistant posts4
మెగా అగచాట్ల డీఎస్సీ!

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపా­ధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థు­లకు చుక్క­లు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకో­వ­డానికి వెబ్‌సైట్‌­ను ఓపెన్‌ చేసిన నిరుద్యోగ ఉపా­ధ్యాయ అభ్య­ర్థులకు సాంకేతిక సమ­స్యలు ఎదు­రవుతు­న్నాయి. ఇప్పటికే కొన్ని నిబ­ంధనలు అడ్డంకి కాగా, ఆన్‌లైన్‌లోనూ సాంకేతిక కార­ణా­లతో దరఖా­స్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతు­న్నాయి. హెల్ప్‌ లైన్‌ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని నిరు­ద్యోగులు వాపోతు­న్నారు. కఠిన నియ­­మాలతో నిరుద్యో­గులు ఇబ్బందు­లు పడు­తు­న్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఆన్‌లైన్‌­లో దరఖాస్తు చేసు­కు­ంటున్న అభ్యర్థుల­ కు పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో కూడా కనీస మార్కులు 45–­50 శాతం లేకుంటే ఇన్‌ వ్యాలి­డ్‌గా చూపి­స్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యా­ర్హత అయిన డిగ్రీలో సగటు మా­ర్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దర­ఖాస్తు సబ్మిట్‌ అవ్వడం లేదు. ఓపెన్‌లో ఇంటర్మీడియట్‌ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతు­న్నా­రు. ఉ­దా­హ­ర­ణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడి­యట్‌లో అరబిక్‌ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్‌లో రెండవ భాష సెలెక్ట్‌ చెస్తే డ్రాప్‌–డౌన్‌ మెనూలో అరబిక్‌ ఆప్షన్‌ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్‌ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్‌ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్‌ ఇవ్వలేదు.డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్‌ ఆప్షన్‌ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతు­న్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలిమెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్య­ర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యో­గులు డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్‌ చేశారు. దీంతో హాల్‌ టికెట్‌ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్‌ చేసుకునే అవకాశం ఇవ్వా­లని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్య­ర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యో­గా­లకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. » ఎస్‌జీటీకి ఇంటర్మీడియట్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్‌ అభ్య­ర్థు­లకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకు­న్నట్లు సమాచా­రం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. » పీజీ ఇంగ్లిష్‌లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మా­ర్కులున్న ఓ జనరల్‌ అభ్యర్థి దర­ఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తు­న్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూ­స్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.» టెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కు­లతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్‌ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

PM Narendra Modi vows severe punishment for terrorists behind Pahalgam attack5
ముష్కర మూకలను మట్టిలో కలిపేస్తాం: ప్రధాని మోదీ

మధుబని: పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు భూమండలంలో ఎక్కడ దాక్కున్నా సరే వెతికి మరీ పట్టుకొని శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్న దుష్ట శక్తులకు తగిన శిక్ష విధించక తప్పదని హెచ్చరించారు. గురువారం బిహార్‌లోని మధుబనిలో జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్, నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలుతోపాటు మరికొన్ని రైళ్లను ప్రారంభించారు. జాతీయ పంచాయత్‌ అవార్డులు ప్రదానం చేశారు. పహల్గాం మృతులకు సంతాప సూచకంగా బహిరంగ సభలో తొలుత మౌనం పాటించారు. అనంతరం మోదీ కొద్దిసేపు ఆంగ్ల భాషలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న ముష్కరులందరినీ కచ్చితంగా శిక్షిస్తామని ప్రతిన బూనారు. ఇలాంటి దాడులు మన నైతిక స్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని అన్నారు. శత్రువులు కేవలం నిరాయుధ పర్యాటకులనే కాదు, మనదేశాన్ని లక్ష్యంగా చేసుకొనే సాహసానికి ఒడిగట్టారని చెప్పారు. వారిని మట్టిలో కలిపేస్తామని స్పష్టంచేశారు. దేశంలో మిగిలిన ఉన్న ఉగ్రవాద శేషాన్ని తుదముట్టించే సమయం వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం ‘‘మిత్రులారా.. బిహార్‌ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం. శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు.దేశమంతటా ఒకేలా ఆగ్రహావేశాలు ఉగ్రవాద దాడిలో ఎంతోమంది నష్టపోయారు. కొందరు తమ కుమారులను పోగొట్టుకున్నారు. మరికొందరు తమ సోదరులను, జీవిత భాగస్వాములను కోల్పోయారు. బాధితులు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాలకు చెందినవారు ముష్కరుల రాక్షసత్వానికి బలయ్యారు. కార్గిల్‌ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతటా ఆగ్రహావేశాలు, విచారం ఒకేలా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి దారుణాలు ఇకపై జరగడానికి వీల్లేదు. వేగవంతమైన అభివృద్ధి కావాలంటే శాంతి, భద్రతలతో కూడిన పరిస్థితులు అత్యంత కీలకం.

YSRCP Leader Buggana Rajendranath Fires On Chandrababu Govt6
తాకట్టులో ఖజానా: బుగ్గన రాజేంద్రనాథ్‌

సాక్షి, అమరావతి: దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ నుంచి రూ.9 వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా బాండ్ల కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఇది దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్ధ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలకు ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చర్యకు అనుమతించిన అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. బుగ్గన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులకు స్కీంకూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్‌ వెలుపల భారీ అప్పులు చేయడం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీఎండీసీ ద్వారా రూ.9 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపై అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీ) బాండ్స్‌ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీఎండీసీ ఎక్కువగా ఔట్‌ సోర్సింగ్‌ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్దఎత్తున అవసరం లేదు. కానీ, రూ.9 వేల కోట్లు కావాలని బాండ్లు జారీ చేస్తున్నారు.రాష్ట్ర ఆర్థిక స్థితి బాగోలేదు..ఇండియా రేటింగ్స్‌ సంస్థ ప్రభుత్వ ఆదాయం గతేడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతమే వృద్ధి కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతానికి పెరిగిందని చెప్పింది. అయినా ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చా­రు. ఎందుకంటే.. డిబెంచర్‌ కొనుగోలు­దార్లకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు జమ­య్యే­ం­దుకు అంగీకరించడం వల్లే. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపీ ఎండీసీ గత వార్షిక నివేదికలో 9 నెలలకు రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డీఎస్‌­ఆర్‌ఏ ఖాతాలో ముందుగా పెట్టే 6 నెలల నిల్వలతో కలిపి చూస్తే రూ.10 వేల కోట్లు. వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. దీనిని ఏ బ్యాంక్‌ కూడా అంగీకరించదు.గతంలో ఎక్కడా లేని విధానం..ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ లేవు. ఖజానాలో ఏ కారణంతో అయినా నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసినవారికి వెళ్లిపోతాయి. బాండ్లు కొన్నవారికి చెల్లింపుల కోసం ముందుగానే నిర్దేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే 30 శాతం.. అంటే మూడో భాగం కచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెల ఉంచాలి. ఇదికాకుండా డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ అకౌంట్‌(డీఎస్‌ఆర్‌ఏ) ఖాతాలో 6 నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఈ నిధులు తగ్గిపోతే ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నేరుగా బాండ్లు కొన్నవారికి వెళ్లిపోతాయి. ⇒ షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులు చేయకపోతే.. గనులను తాకట్టులో ఉంచుకున్న ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు. నాడు బెవరేజెస్‌ కార్పొరేషన్‌పై అప్పులు తెస్తే భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాక... ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలన్నింటినీ తాకట్టు పెట్టా­రు. ఏపీఎండీసీ రెవెన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలా నిబంధన పెట్టారు. ఆ ఖాతా­ను సంపూర్ణంగా అప్పుల కోసం తాకట్టు పెట్టారు. ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి అయినా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు.మిసిలేనియస్‌ జనరల్‌ హెడ్‌కు ఇంత భారీ కేటాయింపులా?2025–26 రాష్ట్ర బడ్జెట్‌లో మిసిలేనియస్‌ జనరల్‌ హెడ్‌–0075 కింద ప్రభుత్వం రూ.7,916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు ఈ నిధులను వాడతారు. ఈ హెడ్‌ కింద 2016 –17లో రూ.131 కోట్లు, 2017 –18లో రూ.307 కోట్లు, 2018 –19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు. కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్‌ కింద 2025–26కి గానూ రూ.7,916 కోట్లుగా చూపించారు. అంటే, పక్కా ప్లాన్‌ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్‌లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు ఇష్టం వచ్చినట్లు వాడేందుకు సిద్ధమయ్యారు. ⇒ గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఇలాగైతే చైనా వంటి దేశాల్లో అధికారులను ఉరి తీస్తారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు అధికారులకు ఎలాంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. ఏపీఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. ఇదేనా సంపద సృష్టి అంటే?తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకేఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్‌ డెబిట్‌ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7 శాతం కన్నా తక్కువ వడ్డీ పడు­తుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయ­బోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్‌గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి.ఇదేనా సంపద సృష్టి అంటే?రాష్ట్ర అప్పులపై కూటమి పార్టీలు అబద్ధాలు చెప్పాయి. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పు­లన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ మట్కా లెక్కల స్థాయికి తెచ్చారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్లలో చేసిన అప్పులు రూ.3,32,500 కోట్లే. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పు చేసింది. మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరా­వతి అప్పులు, బాండ్లు, మార్క్‌ఫెడ్, సివిల్‌ సప్లయిస్‌ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది? మా ప్రభుత్వ హయాంలో ఏటా పేదలకు సంక్షేమ పథకాలను అందించాం. ఈ ప్రభుత్వం ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగుల సొమ్ము రూ.76,516 కోట్లు వాడుకుంది.

Sakshi Guest Column On PM Narendra Modi Guarantee On Kashmir Issue7
ఆ హామీ ఏమైంది?

కశ్మీర్‌లో శాంతి ప్రక్రియ తన నాయకత్వంలో సాధారణ స్థితికి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ గత కొంతకాలంగా పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్‌కు శాంతిని తెస్తానన్నది జమ్ము–కశ్మీర్‌ విషయంలో మోదీ ఇచ్చిన ప్రధానమైన హామీ. కానీ ప్రముఖ పర్యాటక ప్రదేశమైన పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, ప్రధాని ఎంత పొరబడ్డారో చూపించింది. పౌరులపై ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇది. ఇందులో 26 మంది పర్యాటకులు నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ దాడి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీర్ఘకాల వేదనలను పరిష్కరించనప్పుడు అవి ఏదో ఒక రూపంలో బయటపడతాయి. తగ్గని ఉగ్రచర్యలుఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కశ్మీర్‌ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని మోదీ, అమిత్‌ షా ద్వయం పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ద్వారానే దాని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కానీ అది జరగలేదని తాజా ఉగ్రదాడి తేల్చి చెప్పింది. పహల్‌గామ్‌ ఉగ్రదాడి యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపర్చింది. ఈ నేపథ్యంలో తన సౌదీ పర్యటన నుండి అర్ధంతరంగా వెనుదిరిగిన మోదీ యథాప్రకారం కశ్మీర్‌ లోయలో హింసను ఖండించారు. ఆ ఘటన వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని హెచ్చరించారు. మరో వైపున పహల్‌గామ్‌ దాడి ఇటీవలి కాలంలో పౌరులపై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా అభివర్ణించారు. దీనికి ప్రతిస్పందన అన్నట్లుగా, ముస్లింలు అధికంగా ఉన్న కశ్మీర్‌లోని పాఠశాలలు, దుకాణాలను మూసి వేశారు. పహల్‌ గామ్‌ దాడి చెదురుమదురు ఘటన కానే కాదు. లోయలో ఉగ్రవాద చర్యలు ఎన్నడూ తగ్గు ముఖం పట్టలేదని సూచిస్తూ ఇటీ వల పలు హింసా ఘటనలు జరుగుతూ వచ్చాయి. కానీ అవి పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. 2019లో కశ్మీర్‌ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కశ్మీర్‌లో హింసా కాండను అంతం చేయడమే ప్రత్యేక హోదా రద్దుకు కారణం అని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నొక్కి చెప్పారు. దాని కొనసాగింపుగానే గత ఫిబ్రవరి 24న అమిత్‌ షా ఒక ప్రకటన చేస్తూ జమ్మూ కశ్మీర్‌లో ఏర్పడిన శాంతిని శాశ్వత శాంతిగా మార్చాలి అన్నారు. అయితే కశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌కు తూర్పున 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఆ రాష్ట్రంలో శాశ్వత శాంతి ఇంకా ఏర్పడలేదని స్పష్టంగా చూపించింది.ఈ ఘటనకు తామే కారణమని లష్కర్‌–ఎ–తోయిబా అనుబంధ సంస్థ ఇప్పటికే ప్రకటించుకుంది. ఈ ప్రకటనలోని నిజానిజాలు వెంటనే తేలకపోయినా, ఈ దాడి భారత, పాకిస్తాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందని కచ్చితంగా చెప్పవచ్చు. పర్యాటకుల ప్రాణనష్టం పట్ల పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పాక్‌ ప్రభుత్వానికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిగా పాకిస్తాన్‌తో దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న సింధూజలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత ప్రభుత్వం, ఆ దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించడానికి పూనుకుంది.బలహీనమైన కశ్మీర్‌కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసమే ఆ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని రద్దుచేసినట్లు మోదీ తమ ప్రభుత్వ చర్యను సమర్థించుకున్నారు. కానీ కశ్మీర్‌ భూభాగంలో పెట్టుబడులు నేటికీ పరిమితంగానే ఉన్నాయన్నది గ్రహించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, మోదీ పదవీకాలంలో కశ్మీరీలు మరింత బలహీనంగా మారారు. లక్షలాది మంది సైనికులు కాపలా కాస్తున్న ఈ ప్రాంతంలో హిందువులు స్థిర నివాసం ఏర్పర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కశ్మీర్‌ లోయ జనాభా దామాషాను మార్చే ఈ లక్ష్యాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. బయటి జనాభా లోయలోకి వస్తే తమ ఉద్యోగాలు, భూయాజమాన్య హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు భీతిల్లుతున్నారు. అదే సమయంలో నిరంతర దర్యాప్తులు, అణచివేత విధానాల మధ్యనే వారు జీవిస్తున్నారు. విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉండటానికి, భారత ప్రభుత్వం కఠినమైన ప్రయాణ నిషేధాలను, ఉగ్రవాద వ్యతిరేక చట్టాల కింద ఏకపక్ష నిర్బంధాలను ఉపయోగిస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ గతేడాది కశ్మీర్‌ ఎన్నికల సందర్భంలో పేర్కొంది.ఈ ఉగ్రదాడి, చాలా కాలంగా నలుగుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి భారత ప్రభు త్వానికి అవకాశాన్నిస్తోంది. నిజానికి మోదీ మొదటి ఉద్దేశ్యం ఈ ప్రాంతాన్ని మరింతగా దిగ్బంధించడమే. అలా చేస్తే అది పొరపాటవుతుంది. 2019లో భారత ప్రభుత్వం విధించిన అన్ని ఆంక్షలూ... ఇంటర్నెట్‌ సేవలను దీర్ఘకాలికంగా నిలిపివేయడం, రాజకీయ నేతలను నిర్బంధించడంతో పాటు లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేయడం వంటివి ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని రేపాయి. ఆ చర్యలను క్రమంగా ఎత్తివేశారు, అయినా నష్టం జరిగిపోయింది. మరోపక్క ప్రధాన స్రవంతిలో, సోషల్‌ మీడి యాలో అదుపు లేకుండా ముస్లిం వ్యతిరేక భావన కొనసాగుతోంది. మోదీ దాన్ని చూసీచూడనట్టు వదిలే యాలని భావిస్తే కష్టమే. భారతీయులందరికీ నాయకుడిగా ఆయన వ్యవహరించాలి. సంయమనం పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వాలి. ఇప్పటికే ప్రతీకారదాడి అంటూ భావోద్వేగాలతో జనం ఊగిపోతున్నారు. ఆచితూచి వ్యవహరించడమే అంతర్జాతీయంగా ముఖ్యమని గ్రహించాలి.కరిష్మా వాస్వానీ వ్యాసకర్త ఆసియా వ్యవహారాల నిపుణురాలు

Rajasthan Royals lose to Royal Challengers Bangalore by 11 runs8
చిన్నస్వామిలో బెంగళూరు చిందు

రాజస్తాన్‌ విజయానికి చివరి 3 ఓవర్లలో 40 పరుగులు కావాలి... భువనేశ్వర్‌ వేసిన 18వ ఓవర్లో జురేల్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 22 పరుగులు వచ్చాయి. సమీకరణం 12 బంతుల్లో 18 పరుగులకు మారడంతో గెలుపు ఖాయమనిపించింది. అయితే 19వ ఓవర్లో హాజల్‌వుడ్‌ ఒకటే పరుగు ఇచ్చి 2 వికెట్లు తీయడంతో రాయల్స్‌ ఆశలు కోల్పోయింది. చివరి ఓవర్లో దయాళ్‌ 5 పరుగులే ఇచ్చాడు. దాంతో ఈ సీజన్‌లో చిన్నస్వామి మైదానంలో ఆడిన నాలుగో మ్యాచ్‌లో బెంగళూరుకు తొలి గెలుపు దక్కగా ...విజయానికి చేరువగా వచ్చి రాజస్తాన్‌ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది. బెంగళూరు: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దేవదత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరు 51 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అనంతరం రాజస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులే చేసింది. యశస్వి జైస్వాల్‌ (19 బంతుల్లో 49; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ధ్రువ్‌ జురేల్‌ (34 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా ... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోష్‌ హాజల్‌వుడ్‌ (4/33) ప్రత్యర్థిని పడగొట్టడంతో కీలక పాత్ర పోషించాడు. సమష్టి ప్రదర్శన... బెంగళూరుకు ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (23 బంతుల్లో 26; 4 ఫోర్లు), కోహ్లి శుభారంభం అందించడంతో ఆ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి 59 పరుగులు సాధించింది. హసరంగ తొలి ఓవర్లోనే సాల్ట్‌ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ అందించాడు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్‌ మరింత దూకుడుగా ఆడాడు. మరోవైపు కోహ్లి... సందీప్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం వరుసగా పరాగ్, దేశ్‌పాండే వేసిన రెండు ఓవర్లలో కోహ్లి, పడిక్కల్‌ కలిసి 5 భారీ సిక్స్‌లతో మొత్తం 37 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత 11 బంతుల వ్యవధిలో 7 పరుగులు మాత్రమే చేసిన జట్టు కోహ్లి, పడిక్కల్, పాటీదార్‌ (1) వికెట్లు కోల్పోయింది. జైస్వాల్‌ దూకుడు... భారీ ఛేదనలో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ జోరుగా మొదలైంది. తొలి బంతికే సిక్స్‌ కొట్టిన జైస్వాల్‌... దయాళ్‌ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హాజల్‌వుడ్‌ ఓవర్లోనూ అతను వరుసగా మూడు ఫోర్లు బాదాడు. రెండు సిక్స్‌లతో ఆకట్టుకున్న వైభవ్‌ సూర్యవంశీ (16) ఎక్కువ సేపు నిలవలేదు. అనంతరం హాజల్‌వుడ్‌ ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టిన జైస్వాల్‌ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో రాయల్స్‌ 72 పరుగులు రాబట్టడం విశేషం. ఆ తర్వాత మరో రెండు ఓవర్లు నితీశ్‌ రాణా (22 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రియాన్‌ పరాగ్‌ (10 బంతుల్లో 22; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిని ప్రదర్శించడంతో 49 బంతుల్లోనే స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆర్‌సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాయల్స్‌ను నిలువరించడంలో సఫలమైంది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హసరంగ 26; కోహ్లి (సి) రాణా (బి) ఆర్చర్‌ 70; పడిక్కల్‌ (సి) రాణా (బి) సందీప్‌ 50; టిమ్‌ డేవిడ్‌ (రనౌట్‌) 23; పాటీదార్‌ (సి) జురేల్‌ (బి) సందీప్‌ 1; జితేశ్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–61, 2–156, 3–161, 4–163, 5–205. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–33–1, ఫారుఖీ 3–0–30–0, తుషార్‌ దేశ్‌పాండే 2–0–36–0, సందీప్‌ శర్మ 4–0–45–2, హసరంగ 4–0–30–1, పరాగ్‌ 3–0–30–0. రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) షెఫర్డ్‌ (బి) హాజల్‌వుడ్‌ 49; వైభవ్‌ (బి) భువనేశ్వర్‌ 16; రాణా (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ 28; పరాగ్‌ (సి) జితేశ్‌ (బి) కృనాల్‌ 22; జురేల్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 47; హెట్‌మైర్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 11; శుభమ్‌ దూబే (సి) సాల్ట్‌ (బి) దయాళ్‌ 12; ఆర్చర్‌ (సి) పాటీదార్‌ (బి) హాజల్‌వుడ్‌ 0; హసరంగ (రనౌట్‌) 1; దేశ్‌పాండే (నాటౌట్‌) 1; ఫారుఖీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 194. వికెట్ల పతనం: 1–52, 2–72, 3–110, 4–134, 5–162, 6–189, 7–189, 8–189, 9–191. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–50–1, యశ్‌ దయాళ్‌ 3–0–33–1, హాజల్‌వుడ్‌ 4–0–33–4, రొమారియో షెఫర్డ్‌ 1–0–15–0, సుయాశ్‌ శర్మ 4–0–31–0, కృనాల్‌ పాండ్యా 4–0–31–2. ఐపీఎల్‌లో నేడుచెన్నై X హైదరాబాద్‌వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Latest News on movie promotion about Tollywood Film9
ట...ట...ట... నిజమౌనా? 

ఫలానా హీరో–హీరోయిన్‌ కాంబినేషన్‌ కుదిరింద‘ట’... ఓ పాట సెట్‌ కోసం ఐదువందల మందికి పైగా పని చేస్తున్నార‘ట’... ఆ డైరెక్టర్‌ 60 రోజుల్లోనే సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడ‘ట’... ఆ స్టార్‌ హీరో సినిమాలో ఇంకో స్టార్‌ హీరో విలన్‌గా ఫిక్స్‌ అయ్యాడ‘ట’... ఇలా సినిమా పరిశ్రమ గురించి రోజుకో ‘ట...ట...ట...’ అంటూ వార్తలు ప్రచారంలో ఉంటాయి. మరి... ఈ ప్రచారంలో ఉన్న ఈ ‘ట’లు నిజమౌనా? అనేది తెలియాలంటే మాత్రం యూనిట్‌ చెప్పాల్సిందే. ఇక ప్రస్తుతం ఆ నోటా ఈ నోటా విహారం చేస్తున్న కొన్ని ‘ట’ల గురించి ఓ లుక్కేద్దాం.హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన పంథాకి భిన్నంగా ఈ చిత్రాన్ని అతి వేగంగా పూర్తి చేసేం దుకు రాజమౌళి షూటింగ్‌ ప్లాన్‌ చేశారని టాక్‌. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్‌ యాక్షన్ అడ్వెంచరస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పొడవాటి హెయిర్‌ స్టైల్, గెడ్డంతో ఉన్న మహేశ్‌ లుక్స్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌గా మారాయి. ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలోని కోరాపుట్‌లో రెండు షెడ్యూల్స్‌ని మెరుపు వేగంతో పూర్తి చేసిన రాజమౌళి మూడవ షెడ్యూల్‌కి సిద్ధం అయ్యారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెట్‌ కోసం దాదాపు 550 మంది పని చేస్తున్నారని టాక్‌. ఈ సెట్‌లో త్వరలోనే ఓ భారీ సాంగ్‌ని చిత్రీకరించనున్నారట రాజమౌళి. ఈ పాట సినిమాలో హైలైట్‌ అవుతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు కూడా గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రజనీకాంత్‌కి విలన్‌గా... రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో ఫాహద్‌ది పాజిటివ్‌ క్యారెక్టర్‌. ఒక రకంగా చెప్పాలంటే రజనీ పాత్రకు హెల్ప్‌ఫుల్‌గా ఉండే పాత్ర. అయితే ఇప్పుడు రజనీకాంత్‌కి విలన్‌గా మారారట ఫాహద్‌. ఏ సినిమాలో అంటే ‘జైలర్‌ 2’లో అని సమాచారం. రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్‌’ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్‌లో ‘జైలర్‌ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఫాహద్‌ని విలన్‌గా ఎంపిక చేశారని టాక్‌. ఇటీవల కేరళలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభమైంది. తదుపరి షెడ్యూల్‌లో ఫాహద్‌ పాల్గొంటారట. అప్పుడు ఈ చిత్రంలో ఫాహద్‌ విలన్‌గా నటిస్తున్న విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ అధికారికంగా ప్రకటించాలని అనుకుంటోందని సమాచారం. సూర్య–కీర్తి మళ్లీ కుదిరేనా? సూర్య–కీర్తీ సురేష్‌ మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారా? అంటే అవుననే అంటోంది తమిళ పరిశ్రమ. ఈ ఇద్దరూ జంటగా ‘తానా సేంద కూట్టమ్‌’ (2018) అనే చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో సినిమా రూపొందనుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్యకి జోడీగా కీర్తీ సురేష్‌ నటించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి ‘796 సీసీ’ అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ‘సార్, లక్కీ భాస్కర్‌’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్‌ చిత్రాల తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించనున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రీ ్రపొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా కీర్తీ సురేష్‌ను ఎంపిక చేశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి... ఈ వార్తలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి. తమిళ దర్శకుడితో... హీరో కల్యాణ్‌ రామ్‌ జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటించిన ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ ఈ నెల 18న విడుదలై, హిట్‌గా నిలిచింది. తన తర్వాతి చిత్రాన్ని తమిళ దర్శకుడు గిరీశాయతో చేయనున్నారట కల్యాణ్‌ రామ్‌. తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్‌ చేశారు గిరీశాయ. ఈ సినిమా కోలీవుడ్‌లోనూ హిట్‌గా నిలిచింది. కాగా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ (2022) సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు గిరీశాయ. తాజాగా కల్యాణ్‌ రామ్‌ కోసం ఓ కథని సిద్ధం చేశారట ఆయన. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రొటీన్‌ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ కథ కల్యాణ్‌ రామ్‌కి కూడా నచ్చిందట. దీంతో తన తర్వాతి మూవీని గిరీశాయ దర్శకత్వంలో చేయనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ తర్వాత ‘బింబిసార 2’ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే డైరెక్టర్‌ వశిష్ఠ ప్రస్తుతం చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీంతో ‘బింబిసార 2’ మొదలయ్యేందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈలోపు గిరీశాయ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కల్యాణ్‌ రామ్‌ ఆసక్తిగా ఉన్నారని టాక్‌. ఇక కల్యాణ్‌ రామ్, గిరీశాయ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అరవై రోజుల్లో... డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ స్టైలే వేరు. సినిమాలను జెట్‌ స్పీడ్‌లో తెరకెక్కిస్తారనే పేరుంది ఆయనకి. ఎంత పెద్ద సినిమా అయినా మూడు నాలుగు నెలల్లోనే చిత్రీకరణ పూర్తి చేస్తుంటారు. అయితే తన తాజా చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లోనే పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట పూరి. ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రంలో విజయ్‌ సేతుపతి హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ మూవీకి ‘బెగ్గర్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. పూరి సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి బిచ్చగాడి పాత్రలో కనిపించనున్నారట. అందుకే ‘బెగ్గర్‌’ అనే టైటిల్‌ను లాక్‌ చేశారని టాక్‌. మే లేదా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని కేవలం అరవై రోజుల్లో పూర్తి చేయాలన్నది పూరి జగన్నాథ్‌ ఆలోచన అట. ఎందుకంటే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్‌ సేతుపతి ‘బెగ్గర్‌’ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పూరీని కోరారట. అందుకు తగ్గట్టు జెట్‌ స్పీడ్‌లో షూటింగ్‌ పూర్తి చేసేందుకు షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట పూరి జగన్నాథ్‌. రీమేక్‌ చిత్రంతో... వైవిధ్యమైన కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రాజశేఖర్‌. ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన ఆయన తర్వాతి సినిమా ఏంటి? అన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘శేఖర్‌’. ఆయన భార్య జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 మే 20న విడుదలైంది. ఆ తర్వాత నితిన్‌ హీరోగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్‌’ (2023) సినిమాలో కీలక పాత్రలో కనిపించారు రాజశేఖర్‌. ఆ చిత్రం విడుదలై ఏడాదిన్నర దాటినా రాజశేఖర్‌ తర్వాతి సినిమాపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన లేదు. ఇదిలా ఉంటే... తమిళంలో ఘన విజయం సాధించిన ‘లబ్బర్‌ పందు’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేసేందుకు రాజశేఖర్‌ సన్నాహాలు చేస్తున్నారని టాక్‌. తమిళరసన్‌ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ‘లబ్బర్‌ పందు’ చిత్రం గత ఏడాది సెప్టెంబరు 20న తమిళంలో రిలీజై, సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగులో రీమేక్‌ చేసేందుకు హక్కులు కొనుగోలు చేశారట రాజశేఖర్‌. పెళ్లీడుకి వచ్చిన కూతురు ఉన్న ఒక వ్యక్తికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయికి కూడా క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. క్రికెట్, ప్రేమ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్‌లో హిట్‌గా నిలిచింది. ఈ మూవీని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథ, కథనంలో మార్పులు చేసి, రీమేక్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజశేఖర్‌. మరి... ఈ వార్తల్లో వాస్తవం ఏంటన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలి.– డేరంగుల జగన్‌ మోహన్‌

High Court On Bhoodan lands grabbing and investigation into irregularities10
‘భూదాన్‌’పై సీబీఐ విచారణ!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భూదాన్‌ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించింది. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్‌ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్‌ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్‌కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్‌ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.భూకబ్జాలో 26 మంది ఉన్నతాధికారులు: రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.అధికారుల నుంచి స్పందన లేదు..పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్‌ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్‌పై విచారణ జరిపించాలని మహేశ్‌ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు. కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్‌ ప్రొసీడింగ్‌లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్‌ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్‌కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు. అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్‌ పాస్‌బుక్‌లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్‌కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్‌ నోటీసులు పంపారు. క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్‌బుక్‌లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 12కు వాయిదా వేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement