‘ఓటుకు నోటు’ వ్యవహారంలో సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడేనని, టీఆర్‌ఎస్ సర్కారును కూల్చేందుకు బాబు కుట్రపన్నారని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివేదించారు. కోట్లాది రూపాయలు కుమ్మరించి దాదాపు ముప్ఫై మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కుతంత్రాలు జరిగాయని వివరించారు. ఈ మేరకు కీలక ఆధారాలను గవర్నర్‌కు అందజేశారు. ఈ వ్యవహారంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన చంద్రబాబు... ఇప్పుడు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని.. అవాస్తవ ఆరోపణలతో దర్యాప్తు అధికారుల మనోస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన విషయం తెలిసిందే.