నగర శివార్లలోని సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో శాంపిల్స్‌ను సేకరించింది. దీంతోపాటు తహసీల్దార్ ఆఫీస్ పక్కనే ఉన్న హాస్టల్‌లోని సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సేకరించారు. నిందితుడు సురేష్ కాలిన గాయాలతో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను ఈ సీసీటీవీ కెమెరా నమోదుచేసింది. తహసీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన అనంతరం కాలిన గాయాలతో నిందితుడు సురేష్ తాపీగా నడుచుకుంటూ వెళుతున్నట్టు ఈ దృశ్యాలలో కనిపిస్తోంది. ఇప్పటికే సేకరించిన శాంపిల్స్, వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు. తహసీల్దార్ చంపేందుకు సురేష్ కిరోసిన్‌లో పెట్రోల్ కలిపి తీసుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.