దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై అసభ్యమైన, ఆధారాలు లేని ఆరోపణలు చేసిన కేసులో సైబర్ క్రైం పోలీసులు పురోగతి సాధించారు. సామాజిక మాధ్యమాల వేదికగా వైఎస్ షర్మిలని అప్రదిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నిన వ్యక్తిని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా చోడవరంకు చెందిన పెద్దిశెట్టి వెంకటేశ్‌ను గుంటూరులో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గూగుల్ ఇచ్చిన ఐపీ అడ్రస్ ఆధారాలతో నిందితుడిని సీసీఎస్ పోలీసులు పట్టుకుని హైదరాబాద్ తరలించారు. గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో వెంకటేశ్ ఎంసీఏ చదువుతున్నాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 509, 67ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. రేపు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు మంచిర్యాలకు చెందిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.