నటుడు విజయ్
పెరంబూరు: చెన్నైలో గత మూడు రోజులుగా సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో జరిగిన ఐటీ సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సోదాల వ్యవహారం రాజకీయ రంగు పూసుకుంటూ కలకలం సృష్టిస్తున్నాయి. నటుడు విజయ్ అరెస్ట్ అయ్యే అవకాశం?.. కాదు ఆయనే ఈ వ్యవహారంపై కేసు పెట్టవచ్చు.. లాంటి ప్రచారాలు సాగుతున్నాయి. కాగా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు నటుడు విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. విశేషం ఏమిటంటే విజయ్ ఇంట్లో ఐటీ సోదాలకు బీజేపీ పార్టీనే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందుకు కారణం విజయ్ నటించిన మెర్శల్ చిత్రంలో ఉచిత వైద్యం, జీఎస్‌టీ వంటి సన్నివేశాలు చోటు చేసుకున్న విషయం తెల్సిందే. అప్పుట్లో వీటిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా బిగిల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై నటుడు విజయ్ అన్నాడీఎంకే నాయకులకు వార్నింగ్ ఇచ్చే విధంగా మాట్లాడారు. తనను ఏమైనా అనండని, తన అభిమానులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు విజయ్‌పై ఐటీ దాడులతో బీజేపీ, అన్నాడీఎంకే వ్యతిరేక పార్టీల నాయకులకు విమర్శించే అవకాశం వచ్చింది. దాన్ని కొందరు బలంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి లాంటి వారు విజయ్‌పై ఐటీ దాడులకు బీజేపీనే కారణం అని ఆరోపించారు.
పుదుచ్చేరిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నటుడు విజయ్‌ను ఐటీ దాడులతో బెదిరించి తమ పక్కకు తిప్పు కోవాలని బీజేపీ పన్నాగం పన్నుతోందన్నారు. ఆయన నటుడు రజనీకాంత్‌నూ వదల లేదు. దేశంలో శాంతి భద్రతలు కొరవడ్డాయని, అలాంటిది నటుడు రజనీకాంత్ కూడా ఇవేవీ పట్టించుకోకుండా మోదీ, అమిత్‌షా గొంతుగా మారిపోయారని విమర్శించారు. ఇక నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ దాడులను ఖండించారు. ఇది రాజకీయ కుట్ర అని, నటుడు విజయ్‌కు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక ఉందని అన్నారు. అందుకే ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా బీజేపీ ఈ దాడులను చేయించిందని ఆరోపించారు. అంతేకాకండా నటుడు విజయ్ కంటే అధిక పారితోషికం తీసుకుంటున్నవాళ్లూ ఉన్నారని, నటుడు రజనీకాంత్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎస్.అళగిరి కూడా స్పందించారు.
విజయ్ ఇంట్లో ఐటీ సోదాలను ఖండించారు. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీని వ్యతిరేకిస్తున్న వారిని అణచివేయడానికి పలు విషయాలు జరుగుతున్నాయన్నారు. నటుడు విజయ్ మెర్శల్ చిత్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా కొన్ని సన్నివేశాల్లో నటించారని, అందుకే ఆయనపై ఈ ఐటీ దాడులని విమర్శించారు. అలాంటిది సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులెవరూ ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఇకపోతే ఐటీ దాడులను ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందనే ప్రచారం సంచలనంగా మారింది. బిగిల్ చిత్రానికి ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫైనాన్సియర్ అన్భు చెలియన్ వద్ద బారీగా డబ్బు, డాక్యుమెంట్లు లభించాయి. ఆయనపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ కేసు నమోదు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాగా రెండు రోజుల పాటు ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొన్న నటుడు విజయ్ మాత్రం తనపై జరిగిన ఐటీ దాడుల గురించి స్పందించలేదు. శుక్రవారం ఆయన సైలెంట్‌గా తాను నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన అభిమానులు మాత్రం ఆందోళన, ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment