
ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి మళ్లీ విదర్భ బౌలర్లతో ఆటాడుకున్నాడు. రెస్టాఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మరో సెంచరీ సాధించాడు. మూడు సెషన్లు నింపాదిగా ఆడిన విహారి రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుకు బాట వేశాడు. కెప్టెన్ రహానే, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నిర్మించాడు.
నాగ్‌పూర్: వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ రెస్టాఫ్ ఇండియా టాపార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి (300 బంతుల్లో 180 నాటౌట్; 19 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకంతో అజేయంగా నిలిచాడు. రోజంతా ఆడి విదర్భ బౌలర్ల పాలిట సింహస్వప్నంగా మారాడు. దీంతో రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌ను 107 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 374 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ముందు 280 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రంజీ చాంపియన్ విదర్భ ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 16 ఓవర్లలో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. సంజయ్ (17 బ్యాటింగ్), అథర్వ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పుల్వామాలో జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇరానీ కప్‌లో తలపడుతున్న ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.
నాలుగో రోజు శుక్రవారం 102/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా మరో 110 పరుగుల్ని జతచేసింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ విహారి, కెప్టెన్ రహానే (87; 6 ఫోర్లు, 1 సిక్స్) విదర్భ బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 200 పరుగులకు చేరింది. ప్రత్యర్థి కెప్టెన్ ఫజల్ ఈ జోడీని విడగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. రెండో సెషన్‌లో విహారి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇద్దరు కలిసి మరో 63 పరుగులు జతచేశాక ఎట్టకేలకు జట్టు స్కోరు 275 పరుగుల వద్ద ఆదిత్య సర్వతే బౌలింగ్‌లో రహానే స్టంపౌటయ్యాడు. గత రెండేళ్ల కాలంలో 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడిన రహానే కు ఇదే టాప్ స్కోర్. 2017 ఆగస్టు కొలంబోలో లంకతో జరిగిన టెస్టులో అతను (132) సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడే సెంచరీకి సమీపించే స్కోరు చేశాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ (61 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) క్రీజులోకి వచ్చాక స్కోరులో వేగం పుంజుకుంది. విహారి, అయ్యర్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన శ్రేయస్ 4 భారీ సిక్సర్లతో అలరించాడు.
ఇరానీలో సెంచరీల విహారి
ఇరానీ కప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారి ఘనత వహించాడు. ఇంతకుముందు శిఖర్ ధావన్ 2011–12 సీజన్‌లో ఈ ఘనత సాధించాడు. అయితే వరుసగా మూడు సెంచరీలు చేసింది మాత్రం మన తెలుగు తేజమే! గత సీజన్ మ్యాచ్‌లోనూ ఇదే విదర్భపై విహారి శతక్కొట్టాడు. వరుసగా 183, 114, 180 (నాటౌట్) స్కోర్లతో మొత్తానికి విదర్భ పాలిట కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. శుక్రవారం మూడు సెషన్ల పాటు ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 330; విదర్భ తొలి ఇన్నింగ్స్: 425; రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్: 374/3 డిక్లేర్డ్ (విహారి నాటౌట్ 180; రహానే 87; శ్రేయస్ నాటౌట్ 61; ఆదిత్య సర్వతే 2/141); విదర్భ రెండో ఇన్నింగ్స్: 37/1.
Comments
Please login to add a commentAdd a comment