
ఇరానీ కప్ 2025లో (Irani Cup 2025) రంజీ ఛాంపియన్ విదర్భ జట్టు (Vidarbha) బౌలర్ యశ్ ఠాకూర్ (Yash Thakur) (ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడతాడు) చెలరేగిపోయాడు. 16.5 ఓవర్లలో 66 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. యశ్ ధాటికి రెస్ట్ ఆఫ్ ఇండియా (Rest Of India) 214 పరుగులకే ఆలౌటైంది.
ఆట మూడో రోజైన ఇవాళ (అక్టోబర్ 3) రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్‌నైట్ స్కోర్‌కు (124/5) మరో 90 పరుగులు మాత్రమే జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాటర్, రెస్ట్ ఆఫ్ ఇండియా కెప్టెన్ రజత్ పాటిదార్ (66) పోరాడినంత సేపు పోరాడి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు.
ఇవాల్టి ఆటలోనే యశ్ ఠాకూర్ 3 వికెట్లు తీశాడు. ఆట ప్రారంభం నుంచే యశ్ నిప్పులు చెరిగాడు. ఇవాళ హర్ష్ దూబే, ఆదిత్య ఠాకరే తలో వికెట్ తీశారు.
మొత్తంగా యశ్ ఠాకూర్ 4, హర్ష్ దూబే, పార్థ్ రేఖడే చెరో 2, ఆదిత్య ఠాకరే, దర్శన్ నల్కండే తలో వికెట్ తీశారు. రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో పాటిదార్‌తో పాటు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (52) మాత్రమే రాణించాడు. ఈ జట్టులో ఉన్న టీమిండియా ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్ (9), ఇషాన్ కిషన్ (1) దారుణంగా విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ 342 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అథర్వ తైడే (143) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరు మినహా విదర్భ జట్టులో ఒక్కరు కూడా రాణించలేదు.
అమన్ మొఖడే 19, ధృవ్ షోరే 18, దనిశ్ మాలేవార్ డకౌట్, కెప్టెన్ అక్షయ్ వాద్కర్ 5, యశ్ ఠాకూర్ 11, హర్ష్ దూబే డకౌట్, దర్శన్ నల్కండే 20, ఆదిత్య ఠాకరే 2 పరుగులకు ఔటయ్యారు.
రెస్ట్ ఆఫ్ ఇండియా బౌలర్లలో మానవ్ సుతార్, ఆకాశ్‌దీప్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సరాన్ష్ జైన్ 2, అన్షుల్ కంబోజ్, గుర్నూర్ బ్రార్ తలో వికెట్ తీశారు. కాగా, ఇరానీ ట్రోఫీ అనేది రంజీ ఛాంపియన్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య జరుగుతుంది.
చదవండి: కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ