
విరాట్ డబుల్ సెంచరీల వెనుక..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో పరుగుల యంత్రంలా రికార్డుల మోత మోగిస్తున్నాడు.
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో పరుగుల యంత్రంలా రికార్డుల మోత మోగిస్తున్నాడు. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న విరాట్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా ఒత్తిడి లేకుండా అదే జోరు కొనసాగిస్తున్నాడు. మంచినీళ్ల ప్రాయంలా సెంచరీలు చేస్తున్నాడు. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఏకైక టెస్టులో డబుల్ సెంచరీ చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్లో సెంచరీ చేయగానే సంతృప్తి చెందనని, ఎప్పుడూ సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఇష్టపడతానని చెప్పాడు. టెస్టు క్రికెట్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తానన్నాడు. ఉత్సుకతను నియంత్రించుకోవడంతో పాటు మ్యాచ్‌లో ఏ దశలోనూ తృప్తి చెందనని అన్నాడు. బ్యాటింగ్లో నిలకడగా రాణించాలంటే ఫిట్‌నెస్ చాలా అవసరమని, కొన్నేళ్లుగా దీనికోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. మ్యాచ్కు ముందు కొన్నిసార్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కంటే ఫార్మాట్‌ను బట్టి మానసికంగా సిద్ధమవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేయాలంటే సహనంతో చాలాసేపు ఇన్నింగ్స్ కొనసాగించాలని, బ్యాటింగ్‌కు వికెట్‌తో పాటు పరిస్థితులు అనుకూలించాలని, అలాగే షాట్లను జాగ్రత్తగా ఆడాలని విరాట్ చెప్పాడు.