
నాగ్‌పూర్: తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో ఇక్కడ జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన విదర్భ ఆ తర్వాత ప్రత్యర్థిని 390 పరుగులకే ఆలౌట్ చేసి 410 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు మరోసారి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఐదు రోజుల ఫైనల్లో ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న విదర్భకు టైటిల్ ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు 236/6 పరుగులతో ఆదివారం ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (327 బంతుల్లో 183; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు), జయంత్ యాదవ్ (96; 14 ఫోర్లు) పోరాడటంతో ఒక దశలో 314/6తో నిలిచింది. కానీ జయంత్ అవుటయ్యాక విహారికి సహకారం అందించే వారు కరువయ్యారు. దీంతో భారీ షాట్లు ఆడిన అతను చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రత్యర్థి బౌలర్లలో గుర్బా నీ 4, ఆదిత్య సర్వతే 3, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.
హనుమ విహారి భారీ శతకం
రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి ఆటే హైలైట్. 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకొచ్చిన అతను తుదికంటా పోరాడాడు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా స్పిన్నర్ జయంత్ యాదవ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 81 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న విహారి చివరి రోజు మరో 102 పరుగులు చేసి భారీ శతకం బాదాడు. జయంత్ అవుటయ్యాక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నదీమ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 59 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత భారీ షాట్లకు దిగిన అతను సర్వతే బౌలింగ్‌లో అపూర్వ్ వాంఖడేకు చిక్కడంతో రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
సంక్షిప్త స్కోర్లు: విదర్భ తొలి ఇన్నింగ్స్: 800/7; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 390 ఆలౌట్ (విహారి 183, జయంత్ యాదవ్ 96, రజనీశ్ గుర్బానీ 4/70); విదర్భ రెండో ఇన్నింగ్స్ 79/0 (అక్షయ్ వాడ్కర్ 50).
►27 ప్రతి ఏడాది రంజీ ట్రోఫీ విజేత, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే ఇరానీ కప్‌ను రంజీ చాంపియన్ గెల్చుకోవడం ఇది 27వ సారి.
Comments
Please login to add a commentAdd a comment