Ranji Trophy title
-
ఆంధ్ర అదరహో
సాక్షి, ఒంగోలు: ఈ సీజన్లో మరోసారి ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కేరళతో మూడు రోజుల్లోనే ముగిసిన రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర నాలుగు విజయాలు సాధించి, రెండింటిని ‘డ్రా’గా ముగించింది. 18 జట్లున్న ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్‌లో ప్రస్తుతం ఆంధ్ర 27 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93 పరుగులతో వెనుకబడి ఆట మూడో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టును ఆంధ్ర పేస్ బౌలర్లు మొహమ్మద్ రఫీ, యెర్రా పృథ్విరాజ్, శశికాంత్ హడలెత్తించారు. ఫలితంగా కేరళ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రఫీ రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులిచ్చి 3 వికెట్లు... పృథీ్వరాజ్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు, శశికాంత్ 47 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి కేరళ పతనాన్ని శాసించారు. అనంతరం 43 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరా బాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ చేతిలో హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. -
విదర్భదే ఇరానీ కప్
నాగ్‌పూర్: తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో ఇక్కడ జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన విదర్భ ఆ తర్వాత ప్రత్యర్థిని 390 పరుగులకే ఆలౌట్ చేసి 410 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు మరోసారి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఐదు రోజుల ఫైనల్లో ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకున్న విదర్భకు టైటిల్ ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసిన వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు 236/6 పరుగులతో ఆదివారం ఆట కొనసాగించిన రెస్టాఫ్ ఇండియా ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి (327 బంతుల్లో 183; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు), జయంత్ యాదవ్ (96; 14 ఫోర్లు) పోరాడటంతో ఒక దశలో 314/6తో నిలిచింది. కానీ జయంత్ అవుటయ్యాక విహారికి సహకారం అందించే వారు కరువయ్యారు. దీంతో భారీ షాట్లు ఆడిన అతను చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రత్యర్థి బౌలర్లలో గుర్బా నీ 4, ఆదిత్య సర్వతే 3, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. హనుమ విహారి భారీ శతకం రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి ఆటే హైలైట్. 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకొచ్చిన అతను తుదికంటా పోరాడాడు. సహచరులంతా ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా స్పిన్నర్ జయంత్ యాదవ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 81 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న విహారి చివరి రోజు మరో 102 పరుగులు చేసి భారీ శతకం బాదాడు. జయంత్ అవుటయ్యాక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ నదీమ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 59 పరుగులు జతచేశాడు. ఆ తర్వాత భారీ షాట్లకు దిగిన అతను సర్వతే బౌలింగ్‌లో అపూర్వ్ వాంఖడేకు చిక్కడంతో రెస్టాఫ్ ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. సంక్షిప్త స్కోర్లు: విదర్భ తొలి ఇన్నింగ్స్: 800/7; రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్: 390 ఆలౌట్ (విహారి 183, జయంత్ యాదవ్ 96, రజనీశ్ గుర్బానీ 4/70); విదర్భ రెండో ఇన్నింగ్స్ 79/0 (అక్షయ్ వాడ్కర్ 50). ►27 ప్రతి ఏడాది రంజీ ట్రోఫీ విజేత, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరిగే ఇరానీ కప్‌ను రంజీ చాంపియన్ గెల్చుకోవడం ఇది 27వ సారి. -
కర్ణాటకకు షాక్
ముంబై: వరుసగా రెండేళ్ల పాటు రంజీ ట్రోఫీ టైటిల్ గెలిచిన కర్ణాటక ఈసారి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మహారాష్ట్రపై కనీసం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినా నాకౌట్‌కు అర్హత సాధించే స్థితిలో... కర్ణాటక జట్టు 53 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గ్రూప్ ‘ఎ’లో 24 పాయింట్లతో ఐదోస్థానంలో నిలిచి లీగ్ దశతోనే సరిపెట్టుకుంది. ఈ గ్రూప్ నుంచి విదర్భ (29 పాయింట్లు), బెంగాల్ (28), అస్సాం (26) క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. హర్యానా గ్రూప్ ‘సి’కి పడిపోయింది. గ్రూప్ ‘బి’ టాపర్ ముంబై ఇక గ్రూప్ ‘బి’ నుంచి ముంబై జట్టు అగ్రస్థానం (35 పాయింట్లు)తో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. పంజాబ్ (26), మధ్యప్రదేశ్ (24) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్‌కు చేరాయి. ఈ గ్రూప్‌లో గుజరాత్ కూడా మధ్యప్రదేశ్‌తో 24 పాయింట్లతో సమంగా నిలిచినా... మెరుగైన రన్‌రేట్ కారణంగా ఎంపీ ముందుకెళ్లింది. ఇదే గ్రూప్ నుంచి ఆంధ్ర జట్టు ఆఖరి స్థానంలో నిలవడం ద్వారా గ్రూప్ ‘సి’కి పడిపోయింది. వచ్చే ఏడాది ఆంధ్ర జట్టు హైదరాబాద్‌తో కలిసి గ్రూప్ ‘సి’లో మ్యాచ్‌లు ఆడుకుంటుంది. నాకౌట్‌కు సౌరాష్ట్ర, జార్ఖండ్ ఇక గ్రూప్ ‘సి’ నుంచి సౌరాష్ట్ర, జార్ఖండ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు వచ్చే ఏడాది గ్రూప్ ‘ఎ’... ‘బి’లలో ఆడేందుకు అర్హత సాధిం చాయి. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జార్ఖండ్ 10 వికెట్లతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో 31 పాయింట్లతో సౌరాష్ట్ర (36) తర్వాత రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరింది. ఈ గ్రూప్‌లో హైదరాబాద్ 8 మ్యాచ్‌ల ద్వారా 8 పాయింట్లు సాధించి చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.