
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన భారీ చిత్రం 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 13వ తేదీన బీస్ట్ చిత్రం తెర మీదకు రానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర హీరో విజయ్ తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు, ప్రెస్ మీట్లకు దూరంగా ఉంటారు. అయితే తన తాజా చిత్రం 'బీస్ట్' ప్రచార కార్యక్రమాల్లో విజయ్ కనిపించడం అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా 'బీస్ట్' చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి విజయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడో తెలిపాడు. చాలా ఏళ్ల క్రితం తనకు జరిగిన ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానని వెల్లడించారు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి మాట్లాడితే ఆ మీడియా వాళ్లు మరొకటి రాశారన్నాడు.
అయితే మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నాడు. ఆ వ్యాఖ్యలు చేసింది అసలు నేనేనా అనుకునేలా నా మాటలు మార్చి రాసారన్నాడు. ఇక దాంతో నువ్విలా మాట్లాడావంటే మేము నమ్మలేకపోతున్నాం అంటూ తన సన్నిహితులు సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారని విజయ్ వెల్లడించారు.
అలా నాడు తాను అనని మాటలు అన్నట్టుగా రాయడంతో ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని తెలిపాడు. అయితే తన ఇంట్లో వాళ్లకు మాత్రం వాస్తవాలేంటో తెలుసు కానీ బయటి వాళ్లందరికీ తెలియవు. వారందరూ ఆ వార్తలను నమ్ముతారు. ఈ కారణంగా అప్పటి నుంచి తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విజయ్ స్పష్టం చేశారు.