విక్రమ్- పా.రంజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తంగలాన్ రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈమేరకు చిత్ర యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సినిమా తాజాగా హిందీ వర్షన్‌తో బాలీవుడ్‌లో విడుదలకానుంది. ఈ సందర్భం డైరెక్టర్ పా.రంజిత్ తన కొత్త సినిమా గురించి వెల్లడించారు. ఈసారి హిందీలో స్ట్రెయిట్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశానని, దానికి 'బిర్సా ముండా' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు పా.రంజిత్ అధికారికంగా ప్రకటించారు.
పా.రంజిత్‌ది చిత్రపరిశ్రమలో ప్రత్యేక బాణి. సామాజిక అంశాలనే కథావస్తువులుగా తీసుకొని వాటికి అందరూ మెచ్చేలా కమర్షియల్ పంథాలో సినిమా తీస్తారు. అందుకే ఆయన చిత్రాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన తెరకెక్కించనున్న బిర్సా ముండా చిత్రం కూడా అదే కోవకు చెందినదిగా చెప్పవచ్చు. అయితే, ఇందులో నటించబోయే నటీనటుల పేర్లు ఆయన వెల్లడించలేదు.
ఎవరీ బిర్సా ముండా
ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా (1875–1900) జీవిత చరిత్ర చాలా ఎమోషనల్‌గా ముగుస్తుంది. బిర్సా ముండా 19వ శతాబ్దపు జార్ఖండ్ రాష్ట్రంలో బ్రిటిష్, స్వదేశీ భూస్వాములచే బానిసలుగా ఉన్న గిరిజన ప్రజల కోసం పోరాడారు. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయనొక జానపద నాయకుడు. ముండా జాతికి చెందిన బిర్సా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు.
22 ఏళ్ల వయసు ( 1897) లోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించారు. తద్వారా భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడిగా బిర్సా ముండా గుర్తింపు పొందారు. ఆయన గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment