
PC: BCCI/X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కూడా ఉన్నాడు. 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ పేస్ బౌలర్.. అదే ఏడాది అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత రెండేళ్లకు వన్డేల్లో.. మూడేళ్లకు టెస్టుల్లో అరంగేట్రం చేసిన సిరాజ్.. ప్రస్తుతం టీమిండియా పేస్ దళంలో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో పాటు ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో విశ్రాంతి లేకుండా వెయ్యికి పైగా బంతులు బౌల్ చేసి.. ఐదు టెస్టుల్లో కలిపి 23 వికెట్లు పడగొట్టాడు.
ఇక ప్రస్తుతం వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో బిజీగా ఉన్న సిరాజ్.. కెరీర్ తొలినాళ్లలో తనపై ట్రోలింగ్ జరిగిన తీరు.. ఆ సమయంలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ఇచ్చిన సలహాల గురించి తాజాగా పంచుకున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..
ధోని ఆరోజు నాకో మాట చెప్పాడు
‘‘నేను టీమిండియాలో అడుగుపెట్టినపుడే ఎంఎస్ ధోని నాకో మాట చెప్పాడు. ‘ఇతరులు ఏమంటున్నారో అస్సలు పట్టించుకోకు. నువ్వు బాగా ఆడినపుడు ప్రపంచం మొత్తం నీతోనే ఉంటుంది. ఒకవేళ నువ్వు విఫలమైతే మాత్రం నిన్ను దూషించడానికి కూడా ఎవరూ వెనుకాడరు’ అని అన్నాడు.
అవును.. కెరీర్ తొలినాళ్లలో నేనూ ట్రోలింగ్ బారినపడ్డాను. ఏదేమైనా ట్రోల్స్ చేయడం చెడ్డ విషయం. నేను బాగా ఆడినపుడు అభిమానులతో పాటు ఈ ప్రపంచం మొత్తం.. ‘వారెవ్వా.. సిరాజ్ లాంటి బౌలర్ మరొకరు లేనేలేరు’ అని ప్రశంసిస్తారు.
వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో
ఒకవేళ నేను ఫెయిల్ అయితే.. ‘వెళ్లు.. వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’ అన్నవాళ్లూ లేకపోలేదు. ఇదే తరీఖా?.. ఓ మ్యాచ్‌లో హీరో అయిన వాళ్లు మరో మ్యాచ్‌లో పూర్తిగా జీరో అయిపోతారా? (నవ్వులు).
ప్రజలు అంత త్వరగా తమ మాటలు మార్చేస్తారా?.. బయట వ్యక్తుల అభిప్రాయాలను పట్టించుకోవద్దని నేను చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నా. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు నా గురించి ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. వేరే వాళ్లను అసలు పట్టించుకోను. ఇతరులు నా గురించి ఏం అంటున్నా నేను లెక్క చేయను’’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
తీవ్ర విషాదాన్ని దిగమింగుకుని..
కాగా హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ పేద కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి మొహమ్మద్ గౌస్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించేవారు. అయినప్పటికీ క్రికెటర్ కావాలన్న కుమారుడి కలకు ఆయన ఊతమిచ్చారు. అయితే, తనకెంతో ఇష్టమైన సంప్రదాయ ఫార్మాట్లో కొడుకు అరంగేట్రం చేయడానికి కొన్ని రోజుల ముందే గౌస్ మరణించారు.
ఊపిరితిత్తుల్లో సమస్య కారణంగా కోవిడ్ సమయంలో సిరాజ్ తండ్రి మృతి చెందారు. అయితే, సిరాజ్ మాత్రం అరంగేట్రం కోసం ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తన తండ్రికి టెస్టు ఫార్మాట్ అంటే ఇష్టమని.. ఆయనకు తనిచ్చే నివాళి ఇదేనంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
ఇక అప్పటి నుంచి ప్రతి సిరీస్‌కు ముందు తండ్రి సమాధిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఆటో డ్రైవర్ కొడుకు క్రికెటర్ అవుతాడా అన్న హేళనలకు ఆటతోనే సమాధానం ఇచ్చి టీమిండియాలో కీలక సభ్యుడిగా ఎదిగి... రూ. కోట్లు సంపాదిస్తూ ఆర్థికంగానూ నిలదొక్కుకున్న సిరాజ్ యువతరానికి స్ఫూర్తిగా నిలిచాడు.
కాగా 31 ఏళ్ల సిరాజ్ ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 44 వన్డేలు, 42 టెస్టులు, 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్ పేసర్ టెస్టుల్లో 130, వన్డేల్లో 71, టీ20లలో 14 వికెట్లు కూల్చాడు. ఐపీఎల్‌లో 108 మ్యాచ్‌లలో కలిపి 109 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: Rishabh Pant Facts: రిషభ్ పంత్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?