
పురుగులను తరిమేందుకు స్ప్రే ప్రయోగిస్తున్న పాక్ కెప్టెన్
పాకిస్తాన్ మహిళా క్రికెటర్ సిద్రా ఆమిన్ (Sidra Amin)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) భారీ షాకిచ్చింది. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెను మందలించింది. అదే విధంగా.. ఓ డీమెరిట్ (Demerit Point) పాయింట్‌ను కూడా సిద్రా ఖాతాలో జమ చేసింది.
అసలేం జరిగిందంటే... ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన శ్రీలంకలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాయాదులు భారత్- పాక్ మధ్య ఆదివారం (అక్టోబరు 5) కొలంబో వేదికగా తలపడ్డాయి.
భారత్ 247 పరుగులకు ఆలౌట్
ఆర్.ప్రేమదాస స్టేడియంలో అనుకోని విధంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావల్ (31), స్మృతి మంధాన (23) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ 46 పరుగులతో రాణించింది.
మిగతా వారిలో జెమీమా రోడ్రిగెస్ (32), దీప్తి శర్మ (25), రిచా ఘోష్ (35 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. కెప్టెన్ ఫాతిమా సనా షేక్, సైదా ఇక్బాల్ చెరో రెండు, రమీన్ షమీమ్, నష్రా సంధూ ఒక్కో వికెట్ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
బౌలర్ల విజృంభణ
ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు మునీబా అలీ (2), సదాఫ్ షమాస్ (6) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు.

సిద్రా ఆమిన్ హాఫ్ సెంచరీ
ఐదో నంబర్‌లో ఆడిన నటాలియా పర్వేజ్ 33 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ ఒంటరి పోరాటం చేసింది. 106 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 81 పరుగులు చేసింది. అయితే, పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ ఐదో బంతికి స్నేహ్ రాణా బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్‌కు క్యాచ్ ఇవ్వడంతో సిద్రా ఇన్నింగ్స్‌కు తెరపడింది.
అప్పటికే పాక్ ఓటమి దాదాపు ఖరారు కాగా.. సిద్రా తన బ్యాట్‌ను నేలకేసి కొట్టి అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు శిక్ష విధించింది.
అందుకే సిద్రాకు పనిష్‌మెంట్
ఈ మేరకు.. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్‌మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది.
అందుకే ఆమెను మందలించడంతో పాటు.. తన క్రమశిక్షణా రికార్డులో ఓ డీమెరిట్ పాయింట్ జత చేస్తున్నాం. గత 24 నెలల కాలంలో ఆమె చేసిన మొదటి తప్పిదం కాబట్టి ఇంతటితో సరిపెడుతున్నాం’’ అని ఐసీసీ సోమవారం నాటి ప్రకటనలో పేర్కొంది. సద్రా తన తప్పును అంగీకరించింది కావున తదుపరి విచారణ అవసరం లేకుండా పోయిందని.. ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది.
ఆధిపత్యం చాటుకున్న భారత్
కాగా సిద్రా అర్ధ శతకం వృథాగా పోయింది. భారత బౌలర్ల ధాటికి 43 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి పాక్ ఆలౌట్ అయింది. దీంతో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. వన్డేల్లో ముఖాముఖి పోరులో మరోసారి తమ ఆధిపత్యాన్ని (12-0) చాటుకుంది.
పాక్‌తో తాజా మ్యాచ్‌లో భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ క్రాంతి గౌడ్, దీప్తి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. దీప్తి, హర్మన్ రెండు రనౌట్లలో భాగమయ్యారు.
స్ప్రే ప్రయోగిస్తూ
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో పురుగుల వల్ల భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్న వేళ పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్ప్రే ప్రయోగిస్తూ.. పురుగులను వెళ్లగొట్టడం హైలైట్‌గా నిలిచింది. అంపైర్ల అనుమతితోనే ఆమె ఇలా చేయడం గమనార్హం.
చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్