Asia Cup 2023: కొలంబోలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆసియా క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబోలో వర్షాల నేపథ్యంలో ఆసియా కప్-2023 ఫైనల్ వేదికను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ వన్డే టోర్నీని నిర్వహించేందుకు పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ససేమిరా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనేక చర్చల తర్వాత శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ హైబ్రిడ్ విధానంలో ఆసియా కప్ నిర్వహణకు అంగీకరించింది.
శ్రీలంకతో కలిసి సంయుక్తంగా పాక్
భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగేందుకు వీలుగా ఏసీసీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ స్టేజీలో వివిధ వేదికల్లో నిర్వహించిన మ్యాచ్‌లలో గ్రూప్-ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్నాయి.
ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరు వర్షార్పణం
అయితే, కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పల్లెకెల్లెలో దాయాదుల మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. ఆదివారం నాటి భారత్- పాక్ పోరుకు రిజర్వ్ డే కేటాయించారు. చిరకాల ప్రత్యర్థుల పోటీ నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ వరుణుడు కరుణించే అవకాశాలు కనిపించడం లేదు.
ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం 24.1 ఓవర్ల టీమిండియా స్కోరు 147/2 వద్ద ఉండగా ఆటకు ఆటంకం కలిగించిన వర్షం.. సోమవారం కూడా అడ్డంకిగా మారింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్ గంట తర్వాత కూడా ఇంకా ఆరంభం కాలేదు.
ఫైనల్ ఒక్కటే కాదు.. ఆ మ్యాచ్‌ల వేదికలోనూ మార్పులు?
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్ వేదిక మార్పుపై ఏసీసీ దృష్టి సారించినట్లు సమాచారం. వాస్తవానికి కొలంబోలో సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆరోజు కూడా వర్షం ముప్పు సూచనలు ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో క్యాండీలోని పల్లెకెల్లె స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు ఏసీసీ మొగ్గుచూపుతున్నట్లు టైమ్స్‌నౌ తన కథనంలో పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌ల(భారత్- శ్రీలంక, పాక్- శ్రీలంక, భారత్- బంగ్లాదేశ్) మ్యాచ్‌ల వేదికలు కూడా మార్చే యోచనలో ఉన్నట్లు మరో జాతీయ మీడియా పేర్కొంది.
చదవండి: చిక్కుల్లో పాక్ క్రికెట్ జట్టు.. ఐసీసీ సీరియస్! ఏమైందంటే?
Comments
Please login to add a commentAdd a comment