Ind vs SL: నా 15 ఏళ్ల కెరీర్‌లో ఇదే మొదటిసారి.. అప్పటికి నాకు 35: కోహ్లి | First Time In 15 Years: Kohli Confession On Sri Lanka Clash In Asia Cup 2023 | Sakshi
Sakshi News home page

Ind vs SL: నా 15 ఏళ్ల కెరీర్‌లో ఇదే మొదటిసారి.. అప్పటికి నాకు 35 ఏళ్లు: కోహ్లి

Published Tue, Sep 12 2023 2:09 PM | Last Updated on Tue, Sep 12 2023 2:34 PM

First Time In 15 Years: Kohli Confession On Sri Lanka Clash In Asia Cup 2023 - Sakshi

టీమిండియా

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి విశ్వరూపం ప్రదర్శించాడు. పాక్‌ బౌలర్లపై విరుచుకుపడుతూ.. అద్భుతమైన షాట్లతో అభిమానులను అలరించాడు. కెరీర్‌లో 77వ సెంచరీ నమోదు చేసి రన్‌మెషీన్‌ అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు.

ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన రిజర్వ్‌ డే మ్యాచ్‌లో కోహ్లి 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. కోహ్లితో పాటు కేఎల్‌ రాహుల్‌ కూడా శతకం(111- నాటౌట్‌)తో మెరవడంతో టీమిండియా 356 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ను టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చుక్కలు చూపించాడు. ఏకంగా 5 వికెట్లు కూల్చి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. బుమ్రా, పాండ్యా, శార్దూల్‌ తలా ఓ వికెట్‌ తీయగా.. 128 పరుగులకే పాక్‌ కథ ముగిసింది. 228 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది.

దీంతో సూపర్‌-4లో సోమవారం తొలి విజయం నమోదు చేసిన టీమిండియా మంగళవారం శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వెంట వెంటనే మ్యాచ్‌లు ఆడటంపై ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ విరాట్‌ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఈ ఇన్నింగ్స్‌ నాకు సంతోషాన్నిచ్చింది. అయితే, రేపు(మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు మళ్లీ మైదానంలో దిగాలి. నా 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అదృష్టవశాత్తూ మేము టెస్టు ప్లేయర్లం కాబట్టి సరిపోయింది.

ఒకరోజు పూర్తిస్థాయిలో బ్యాటింగ్‌ చేసిన తర్వాత కూడా తదుపరి రోజు ఎలా ఆడాలో ఐడియా ఉంటుంది. అయితే, అలసిపోయిన శరీరాన్ని తిరిగి పునరుత్తేజం చేసుకోవడం మీదే అంతా ఆధారపడి ఉంటుంది. 

నవంబరు నాటికి నా వయసు 35 ఏళ్లు. నేను కూడా నా బాడీ గురించి శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా క్రికెటర్లందరిలో అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్‌ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక.. కొలంబో వేదికగా సూపర్‌-4 తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement