
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు యోచన
రాబోయే సిరీస్‌కు కొత్త పేరు?
లండన్: ఇంగ్లండ్ గడ్డపై భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ను 2007 నుంచి మన్సూర్ అలీఖాన్ (ఎంఏకే) పటౌడీ ట్రోఫీ పేరిట నిర్వహించడం జరుగుతోంది. అయితే ‘పటౌడీ ట్రోఫీ’కి గుడ్‌బై చెప్పాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) భావిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో భారత్ పర్యటన నుంచి దీనిని అమలు చేయాలనే ఆలోచనలో ఈసీబీ ఉందని సమాచారం.
‘పటౌడీ ట్రోఫీ’కి మంగళం పాడేందుకు కచ్చితమైన కారణాన్ని ఈసీబీ ఇంకా వెల్లడించకపోయినా... ‘పటౌడీ’ పేరు బదులుగా రెండు దేశాల నుంచి ఇద్దరు దిగ్గజాల పేరుతో సరికొత్త ట్రోఫీ తెరపైకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ‘పటౌడీ ట్రోఫీ’కి ముగింపు పలికే విషయంపై ఈసీబీ అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. ‘పటౌడీ ట్రోఫీ’ మార్పు ఉండదని చెప్పడంలేదు. ఎంఏకే పటౌడీ 1961 నుంచి 1975 మధ్యకాలంలో భారత జట్టు తరఫున 46 టెస్టులు ఆడారు.
‘పటౌడీ ట్రోఫీ’కి వీడ్కోలు పలుకుతున్నామనే విషయాన్ని పటౌడీ కుటుంబసభ్యులకు ఇప్పటికే ఈసీబీ సమాచారం ఇచ్చిందని తెలిసింది. ‘కొంతకాలం తర్వాత ఆయా వ్యక్తుల పేర్లతో నిర్వహించే ట్రోఫీలకు ముగింపు పలకడం సహజం’ అని పటౌడీ కుటుంటానికి సన్నిహితులు వ్యాఖ్యానించడం గమనార్హం. క్రికెట్‌లో ‘ట్రోఫీ’లు రిటైర్ కావడం సహజమే.
గతంలో ఇంగ్లండ్–వెస్టిండీస్ జట్ల మధ్య ‘విజ్డెన్ ట్రోఫీ’తో సిరీస్‌లు జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘విజ్డెన్ ట్రోఫీ’కి రిటైర్మెంట్ ఇచ్చేసి దాని బదులుగా రెండు జట్ల మధ్య ‘రిచర్డ్స్–బోథమ్ ట్రోఫీ’తో సిరీస్‌లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా దేశాల మధ్య నాలుగు ట్రోఫీల టెస్టు సిరీస్‌లు నిర్వహిస్తున్నారు.
భారత్–ఆ్రస్టేలియా జట్ల మధ్య 1996 నుంచి ‘బోర్డర్–గావాస్కర్ ట్రోఫీ’... వెస్టిండీస్–ఆస్ట్రేలియా జట్ల మధ్య 1960 నుంచి ‘ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీ’... ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య 2007 నుంచి ‘వార్న్–మురళీథరన్ ట్రోఫీ’... న్యూజిలాండ్–ఇంగ్లండ్ జట్ల మధ్య 2024 నుంచి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’లను నిర్వహిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటన సమయంలో భారత్–ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ 2007 నుంచి ‘పటౌడీ ట్రోఫీ’తో జరుగుతోంది. భారత్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ను 1951 నుంచి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ‘ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ’ పేరుతో నిర్వహిస్తున్నారు.