టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రపంచ క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు) 300 విజయాల్లో భాగమైన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 12) జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించడం ద్వారా కోహ్లి ఈ ఘనతను సాధించాడు.
ప్రపంచ క్రికెట్‌లో కోహ్లికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 377 విజయాలు సాధించాడు. ఆతర్వాత లంక లెజెండ్ మహేళ జయవర్ధనే (336), క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (307), సౌతాఫ్రికన్ ఆల్‌టైమ్ గ్రేట్ జాక్ కల్లిస్ (305), లంక లెజెండ్ కుమార సంగక్కర (305) ఉన్నారు.
ఇదిలా ఉంటే, లంకతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఆసియా కప్-2023 ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ రోహిత్ శర్మ (53), కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33), అక్షర్ పటేల్ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. లంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే (5/40), చరిత్ అసలంక (4/18) టీమిండియా పతనాన్ని శాశించారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ (4/43), బుమ్రా (2/30), జడేజా (2/33), సిరాజ్ (1/17), హార్ధిక్ పాండ్యా (1/14) కకావికలం చేశారు. వీరి ధాటికి లంకేయులు 41.3 ఓవర్లలో 172 పరుగులకు చాపచుట్టేశారు. లంక ఇన్నింగ్స్‌లో దునిత్ వెల్లలగే (42 నాటౌట్) ఒక్కడే పోరాడాడు.
Comments
Please login to add a commentAdd a comment