చెరువు మట్టి.. చేలకు పుష్టి | Sakshi
Sakshi News home page

చెరువు మట్టి.. చేలకు పుష్టి

Published Mon, May 6 2024 7:40 AM

చెరువు మట్టి.. చేలకు పుష్టి

● ఉపాధి పథకంలో 118 చెరువుల్లో పూడికతీతలు ● కూలీలకు లభిస్తున్న పని.. రైతులకు మేలు ● పంట పొలాలకు తీసుకెళ్తున్న రైతులు

కథలాపూర్‌(వేములవాడ): ఉపాధి హామీ పథకం కూలీలకే కాదు.. రైతులకూ మేలు చేస్తోంది. పంటల సాగులో అడ్డగోలుగా రసాయనిక ఎరువులు వినియోగం పెరిగి భూసారం క్షీణిస్తోంది. భవిష్యత్తులో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారుతుందనే భయం ఉంది. అనుకున్న దిగుబడి రాకపోగా.. పెట్టుబడి పెరిగి రైతులు ఆర్థికంగా నష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలో రైతులు సేంద్రియ ఎరువుల ప్రాధాన్యాన్ని గుర్తించి చెరువుల్లోని మట్టిని తమ పంట పొలాలకు తరలించుకుంటున్నారు. చెరువుల్లో పూడికతీత పనులను ఉపాధిహామీ పథకంలో కూలీలతో చేయిస్తున్నారు. కూలీలు తీసిన మట్టిని రైతులు ట్రాక్టర్లలో పంట పొలాలకు తీసుకెళ్తున్నారు. పొలాలు విలువైన పోషకాలతో కూడి సారవంతమవుతున్నాయి. ఈ మట్టిని పొలాల్లో వేసుకోవడంతో.. సేంద్రియ ఎరువుగా పని చేసి భూసారం పెరిగి పంటల దిగుబడి పెరుగుతోంది. అంతేకాకుండా రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో రైతులకు ఖర్చు తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

118 చెరువుల్లో పూడికతీత పనులు

జిల్లాలో 20 మండలాలుండగా.. 380 గ్రామాలున్నాయి. జిల్లాలో 1,39,822 మంది ఉపాధిహామీ కూలీలున్నారు. వేసవిలో వ్యవసాయ, ఇతర పనులు లేకపోవడంతో.. కూలీలు ఉపాధి పనులకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సుమారు 54వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకం పనులకు హాజరవుతున్నారు. ఈ వేసవిలో 118 చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఆయా చెరువుల్లో ఉపాధిహామీ పథకంలో కూలీలతో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఉపాధి పథకంలో పని చేస్తున్న కూలీలు చెరువుల్లోని మట్టిని తీసి ట్రాక్టర్‌లో పోస్తుండగా.. రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్‌లో మట్టిని పంట పొలాలకు తీసుకెళ్తున్నారు. గతంలో చెరువులోని మట్టిని ప్రభుత్వమే ఉచితంగా ట్రాక్టర్‌లో సరఫరా చేసేదని రైతులంటున్నారు.

చెరువు మట్టితో ప్రయోజనాలు

చెరువు మట్టితో పంట పొలాలు సారవంతమవుతాయి. పోటాషియం, జింక్‌, నత్రజని, భాస్వరం, బోరాన్‌ వంటి పోషకాలు పెరుగుతాయి. పంటలో తేమ శాతం పెరగడంతో నీటి వినియోగం తగ్గుతుంది. చెరువు మట్టి వేసుకున్న పంట భూముల్లో క్రిమిసంహారక మందుల వాడకం ఎకరానికి రూ.3వేల నుంచి రూ.4వేల పెట్టుబడి తగ్గుతుందని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement