
అన్ని రంగాల్లోనూ సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యా రంగంలోనూ ప్రవేశించింది. ఏఐని విద్యలో విలీనం చేసే దిశగా గౌహతిలో రాయల్ గ్లోబల్ స్కూల్ తొలి ఏఐ టీచర్ 'ఐరిస్'ను ఆవిష్కరించింది.
సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్‌లో విద్యార్థులు ‘ఐరిస్’ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా, ఉదాహరణలతో చక్కగా సమాధానాలు ఇచ్చింది.
విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు.. కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. నీతి ఆయోగ్ ప్రారంభించిన అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) ప్రాజెక్టు కింద మేకర్ల్యాబ్స్ ఎడ్యు-టెక్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ‘ఐరిస్’ విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గణనీయమైన పురోగతికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment