IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..! | Sakshi
Sakshi News home page

IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!

Published Sun, May 5 2024 12:02 PM

IPL 2024: Players Without Expectations Performing Best In This Season

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్నారు. బ్యాటర్ల విషయానికొస్తే.. రాజస్థాన్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఈ సీజన్‌లో అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి మెరుపులు మెరిపిస్తున్నాడు. రియాన్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 58.43 సగటున 159.14 స్ట్రయిక్‌రేట్‌తో 409 పరుగులు చేసి నాలుగో లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఇరగదీస్తున్న మరో బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ. ఈ ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్‌ ఈ సీజన్‌లో అదిరిపోయే ప్రదర్శనలతో అంచనాలకు అందని రీతిలో రెచ్చిపోతూ తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అభిషేక్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో అదిరిపోయే స్ట్రయిక్‌రేట్‌తో 315 పరుగులు చేశాడు.

వద్దనుకున్న ఆటగాడే గెలుపు గుర్రమయ్యాడు..
ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఓ ఆటగాడు ప్రత్యేకించి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. శశాంక్‌ సింగ్‌ అనే పంజాబ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ సీజన్‌లో శశాంక్‌ మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 288 పరుగులు చేసి తన జట్టు సాధించిన ప్రతి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. 

శశాంక్‌ను ఈ సీజన్‌ వేలంలో పంజాబ్‌ పొరపాటున సొంతం చేసుకుందని ప్రచారం జరిగింది. పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా మరో శశాంక్‌ అనుకుని ఈ శశాంక్‌ను సొంతం చేసుకుందని సోషల్‌మీడియా కోడై కూసింది. అంతిమంగా చూస్తే ఈ వద్దనుకున్న ఆటగాడే పంజాబ్‌ సాధించిన అరకొర విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఈ సీజన్‌లో రఫ్ఫాడిస్తున్న మరో ప్లేయర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌. ప్రభ్‌సిమ్రన్‌ ఈ సీజన్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు స్ట్రయిక్‌రేట్‌తో 221 పరుగులు చేశాడు. 

అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టిస్తున్న మరో బ్యాటర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డి. ఈ ఎస్‌ఆర్‌హెచ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఏ అంచనాలు లేకుండా బరిలోకి దిగి మెరుపు ఇన్నింగ్స్‌లతో తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. నితీశ్‌ ఈ సీజన్‌ లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సన్‌రైజర్స్‌ పాలిట గెలుపు గుర్రమయ్యాడు. వీళ్లే కాక చాలామంది అన్‌క్యాప్డ్‌ బ్యాటర్లు  ఈ సీజన్‌లో ఇరగదీస్తున్నారు.

బౌలర్ల విషయానికొస్తే.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంతితో సత్తా చాటుతున్న వారిలో సన్‌రైజర్స్‌ పేసర్‌ నటరాజన్‌ ముందు వరుసలో ఉన్నాడు. నటరాజన్‌ గతంలో అద్భుతంగా రాణించినప్పటికీ.. గత కొన్ని సీజన్లలో ఇతని ప్రదర్శన సాధారణ స్థాయికి పడిపోయింది. దీంతో ఈ సీజన్‌కు ముందు ఇతనిపై ఎలాంటి అంచనాలు లేవు. 

అండర్‌ డాగ్‌గా బరిలోకి దిగిన నట్టూ.. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతను సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌టేకర్‌గా కొనసాగుతున్నాడు. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లుగా బరిలోకి దిగి ఇరగదీస్తున్న బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌, సందీప్‌ శర్మ, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌ నట్టూ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. వీరంతా ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమతమ జట్ల పాలిట గెలుపు గుర్రాలయ్యారు.

 

 

 

Advertisement
 
Advertisement