75 బృందాలు..100 రోజులు  | Sakshi
Sakshi News home page

75 బృందాలు..100 రోజులు 

Published Mon, Dec 26 2022 3:43 AM

Second Phase Kanti Velugu Programme From Jan 18th 2023 - Sakshi

సాక్షి,మేడ్చల్‌ జిల్లా: రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చే నెల 18న కార్యక్రమం ప్రారంభం కానుండగా, ఇప్పటికే గ్రామీణ, పట్టణ జనాభాకు అనుగుణంగా వైద్య బృందాల నియామకం పూర్తయింది. ఈ మేరకు నేత్ర వైద్య సహాయకులు, కంప్యూటర్‌ ఆపరేటర్లను తాత్కాలిక పద్ధతిలో నియమించారు.

వంద రోజుల పాటు నిర్వహించే కంటివెలుగుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. వారానికి అయిదు రోజుల పాటు నిర్దేశించిన కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. 2018లో మొదటి విడత కంటివెలుగు నిర్వహించిన సమయంలో పరీక్షలు నిర్వహించి దృష్టి లోపం ఉన్నవారిలో కొందరికే శస్త్రచికిత్స చేశారు.  ఈసారైనా శస్త్రచికిత్స చేసి కంటి అద్దాలు పంపిణీ చేస్తారని కంటి రోగులు ఆశిస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి శస్త్రచికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

ఒక్కో బృందంలో ముగ్గురు.. 
మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో 27,75,067 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 డివిజన్ల పరిధిలో 20,92,711 మందికి  పరీక్షలు చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు  43 బృందాలను నియమించారు.  జిల్లాలోని బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్,నిజాంపేట నగర పాలక సంస్థలు , మేడ్చల్, గుండ్లపోచంపల్లి ,దుండిగల్‌ ,కొంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తంగా 289  డివిజన్లు/ వార్డులు ఉండగా, 5,36,567 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో 18 బృందాలను నియమించారు.

అలాగే, 61 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,45,789 జనాభా ఉన్నట్లు వైద్య శాఖ అధికారులు అంచనా వేసి, 10 బృందాలను నియమించారు.  జిల్లావ్యాప్తంగా  మొత్తంగా 75 బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో వైద్యుడు, నేత్ర వైద్య సహాయకుడు, ఆపరేటర్‌ ఉంటారు. వీరికి స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సహకరిస్తారు. ఇటీవలే  వైద్య బృందాలకు శిక్షణ ఇచ్చారు. సెలవు దినాలు మినహా వారానికి అయిదు రోజుల చొప్పున 100 రోజుల పాటు వైద్య పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షించే పరికరాలను, ఆటో రిఫ్రాక్టర్‌(ఏఆర్‌) మీటర్లను ప్రభుత్వం సమకూరుస్తుంది. 

నిరంతరాయంగా శిబిరాలు.. 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కంటివెలుగు కార్యక్రమం నిర్వహణకు వైద్యఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. ఇటీవలి కాలంలో కంటి సంబంధిత సమస్యలతో బాధ పడే వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో కంటివెలుగు కార్యక్రమం అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షలతో సరిపెట్టకుండా లోపాలున్న ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని వారందరికీ శస్త్రచికిత్స నిర్వహిస్తేనే పేదలకు ప్రయోజనం కలగనుంది. 

ఈసారైనా శస్త్రచికిత్సలు జరిగేనా.. 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో తొలి విడతలో 1,27,146 మందిని పరీక్షించగా 82,157 మందికి మాత్రమే కంటి అద్దాలు అందజేశారు. జిల్లాలో 42,148 మందికి అధిక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించటంతోపాటు కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించినప్పటికిని, 545 మందికి మాత్రమే  కంటి ఆపరేషన్లు చేశారు. మిగతా వారందరికి  విడతల వారిగా శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.బాధితులు శస్త్రచికిత్స కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది.  

ప్రతి ఒక్కరికీ పరీక్షలు.. 
జిల్లాలో కంటివెలుగు నిర్వహణ కోసం వైద్య బృందాలను నియమించాం. పరికరాలు, ఇతర వనరులపై ప్రభుత్వానికి నివేదించాం. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటాం. 
–డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి  

Advertisement
 
Advertisement
 
Advertisement