జిల్లాలో రైతులకున్న భూముల వివరాలను తాజా పర్చేందుకు ఏర్పాటు చేసిన మీ భూమి...మీ ఇంటికి కార్యక్రమం ఆక్రమణదారుల
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో రైతులకున్న భూముల వివరాలను తాజా పర్చేందుకు ఏర్పాటు చేసిన మీ భూమి...మీ ఇంటికి కార్యక్రమం ఆక్రమణదారుల గుం డెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఆక్రమణలపై కూడా ఫిర్యాదులు తీసుకుంటామని, ప్రభుత్వ భూమిని ఆక్రమిం చిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు తెలపడంతో ఆక్రమణదారులు భయపడుతున్నారు. జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణదారుల చెరలో ఉన్నాయి. వీటిని గతంలో అధికారులు గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోలేదు. జి ల్లాలో మీ భూమి మీ ఇంటికి కార్యక్రమాన్ని 1551 గ్రామాల్లో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో రైతులకు వన్‌బి ఇచ్చి అందులో ఉన్న వివరాలు తప్పా రైటా అని ఆరా తీస్తారు. దీంతో పాటే ఎలాగూ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు, కనుక భూముల ఆక్రమణలపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తారు. జిల్లాలో 12,76,720 ఎకరాల భూమి ఉంది. ఇందులో పల్లపు భూమి 3,08,904 ఎకరాలుండగా, మెట్ట భూమి 5,08,787 ఎకరాలుంది. ప్రభుత్వానికి చెందిన భూమి 4,26,005 ఎకరాలుంది. అలాగే 63,882 ఎకరాల అటవీ భూమి ఉంది. ఇవి కాకుండా ప్రభుత్వం పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలు, ఇతర రిజర్వు స్థలాలు కలిపి 30,858 ఎకరాలున్నాయి.
ఇందులో అన్ని వర్గీకరణల్లోనూ కలిపి దాదాపు 50 వేల ఎకరాలకు పైగా భూములు ఆక్రమణలో ఉన్నట్టు ఒక అంచనా!. ఈ భూ వివరాలను ఏటా తాజా పర్చాల్సి ఉన్నప్పటికీ అలా జరగడం లేదు. వ్యవసాయ సాగు భూమి (పల్లం, మెట్టు కలిపి)8,17,691 ఎకరాలుండగా, ఇప్పటికి వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 4.20లక్షల ఎకరాలు మాత్రమే నమోదై ఉంది. పూర్తి వివరాలు నమోదు కాకపోవడంతో అధికారుల సహాయంతో రికార్డులను ఏకంగా తమకు అనుకూలంగా కొంతమంది ఆక్రమణదారులు మార్చుకున్నారు.
అమలుకాని ఆదేశాలు: ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి, వాటికి హద్దులను నిర్ణయించి రక్షణ కంచెలు, ప్రహరీలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించింది.
కానీ ఇప్పటివరకు నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు గుర్తించిన హద్దులను అక్రమార్కులు చెరిపేస్తున్నారు. వీటిపై గ్రీవెన్స్‌సెల్‌లకు చాలా ఫిర్యాదులందాయి. వచ్చిన మేరకు అధికారులు గుర్తిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త కార్యక్రమం మీ భూమి...మీ ఇంటికి గ్రామసభల్లో ఫిర్యాదులు స్వీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ఈ కార్యక్రమం ద్వారా అయినా ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చెరనుంచి బయటపడితే ప్రభుత్వానికి కోట్లాది రూపాయల విలువయిన భూములు మిగిలే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.
ఫిర్యాదులు తీసుకుని చర్యలు చేపడతాం!
మీ భూమి-మీ ఇంటికి కార్యక్రమంలో ఆక్రమణలపై ఫిర్యాదులు తీసుకోవాలనే నిబంధన ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించినట్టుగ్రామసభల్లో ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.
-ఆర్ శ్రీలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,
కోనేరు రంగారావు సిఫార్సుల అమలు కమిటీ, విజయనగరం.