
సాక్షి, గూడూరు: మండు వేసవి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా అభిమాన నేత కోసం జనతరంగమై తరలివచ్చింది. రాష్ట్ర భవితకు దిశ, దశ చూపే దివిటీగా కనిపిస్తున్న ఆయనకు అండగా ఉన్నామంటూ నియోజకవర్గ ప్రజలు వేలాదిగా తరలివచ్చి తమ మద్దతును చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం గూడూరు పట్టణానికి వచ్చారు. నిమ్మ మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద జగన్ కోసం వేచి ఉన్నవారంతా హెలికాప్టర్ కనిపించడంతో అడుగో జగనన్న... వచ్చేస్తున్నాడంటూ కేరింతలు కొట్టారు. రెట్టించిన ఉత్సాహంతో సీఎం జిందాబాద్ అంటూ ఈలలు వేస్తూ ఘన స్వాగతం పలికారు.
గతేడాది ప్రజాసంకల్పయాత్రలో మీ నియాజకవర్గానికి వచ్చాను. అప్పుడు నిమ్మ రైతులు గిట్టుబాటు ధరల్లేవని గోడు వెళ్లబోసుకున్నారు. ఒక్క సీజన్‌లో తప్ప 80 కిలోల లూజు బస్తా కనీసం ఐదొందల రూపాయలు కూడా పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాలను విన్నాను. కనీస మద్దతు ధర లభించక రైతన్న పడుతున్న కష్టాలను చూశాను.. అధికారంలోకి వచ్చాక వారికి బాసటగా నిలుస్తాను. ఒకటో, రెండో పట్టణాలను కలుపుతూ నిర్మాణ దశలో ఉన్న ఫై ఓవర్ వంతెన ఆనాటి నుంచి ఈ నాటి వరకూ కూడా ఒక్క అంగుళం కూడా కదలకపోవడం దారుణం. రెండో పట్టణం ఎంతో విస్తరించింది. వాహనాల్లో రైలు పట్టాలు దాటాలంటే గంటల తరబడి ఎండకూ, వానకూ తడుస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశం నా దృష్టికి వచ్చింది.
ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 64 కోట్లు మంజూరు చేసి గూడూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చారు. అయితే ఆ పథకం సక్రమంగా అమలు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం కూడా నా దృష్టికి వచ్చింది. నియోజకవర్గ ప్రజల చిరకాల కలైన దుగ్గరాజపట్నం పోర్టు కార్యరూపం దాల్చకపోవడంతో అభివృద్ధి జరగలేదు. సీఎం హోదాలో చంద్రబాబు ఒక్క సంతకం చేసుంటే పోర్టు పనులు ఎప్పుడో ప్రారంభం అయ్యేవి. కానీ ఆయన ప్రైవేట్ పోర్టు యాజమాన్యానికి కొమ్ము కాస్తుండడంతోనే దుగ్గరాజపట్నం పోర్టుపై శీతకన్ను వేశారు. నియోజకవర్గ పరిధిలోని అసంపూర్తిగా ఉన్న గంగ కాలువలు పూర్తయితే వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి.
ఈ టీడీపీ ప్రభుత్వం కనీసం ఆ దిశగా కూడా పనిచేయక పోవడం దారుణం. వేల ఎకరాలు బీడు భూములుగానే ఉన్నాయి.‘ మీ సమస్యలన్నింటిని నేను విన్నాను.. వాటి పరిష్కారానికి నేను ఉన్నాను’ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గూడూరు నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరిస్తా. నేనున్నానంటూ నియోజకవర్గ ప్రజలకు జగన్ అభయం ఇచ్చారు.