ఎఫ్‌ఐఐల నిరవధిక పెట్టుబడులతో మార్కెట్లు మరోసారి కొత్త గరిష్టాలను తాకాయి.
ఎఫ్‌ఐఐల నిరవధిక పెట్టుబడులతో మార్కెట్లు మరోసారి కొత్త గరిష్టాలను తాకాయి. అయితే లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మిడ్ సెషన్‌లో నష్టాలలోకి మళ్లాయి. ఆపై ఒడిదుడుకుల మధ్య కదిలి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. వెరసి తొలుత సెన్సెక్స్ 105 పాయింట్లు ఎగసి 28,283ను తాకగా, నిఫ్టీ సైతం 8,454ను దాటింది. ఆపై నష్టాలలోకి మళ్లిన సెన్సెక్స్ చివరికి 15 పాయింట్లు తక్కువగా 28,163 వద్ద నిలిచింది. నిఫ్టీ 5 పాయింట్లు తగ్గి 8,426 వద్ద స్థిరపడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 237 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం చిన్న షేర్లకు డిమాండ్ కనిపించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.3-0.9% మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,743 లాభపడితే, 1,366 నష్టపోయాయి.
సెసాస్టెరిలైట్ జోరు
సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, ఓఎన్‌జీసీ, టీసీఎస్ 2-1% మధ్య నష్టపోగా, సెసాస్టెరిలైట్ 4%పైగా ఎగసింది. ఈ బాటలో భెల్, ఎల్‌అండ్‌టీ, భారతీ, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2-1.5% మధ్య లాభపడ్డాయి.