
సాక్షి, హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గో రక్షా పేరిట గోవులను రక్షిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ బషీర్ బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు నిరాహారదీక్ష చేస్తానని రాజా సింగ్ ప్రకటించారు. దీంతో సోమవారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం బషీర్‌బాగ్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ బయలుదేరడానికి వెళుతుండగా పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గోవులను రక్షించి గోశాలకు తరలిస్తుంటే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. బక్రీద్ కోసం ఓల్డ్ సిటీకి తరలించిన గోవులను, గోవు దూడలను వెంటనే గోశాలకు తరలించాలన్నారు. గోవులను వదించడానికి పిలిపించిన కసాయిలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తన డిమాండ్లు నెరవేర్చే వరకు నిరాహారదీక్ష కొనసాగిస్తానని తెలిపారు. కాగా, నిరసన దీక్షకు అనుమతి లేదని పోలీసులు రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.