డ్వాక్రా రుణమాఫీపై నిలదీత
డ్వాక్రా రుణాల మాఫీ కేవలం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైందేగానీ ఆచరణలో అమలుకావడం లేదని..
* జనచైతన్య యాత్రలో మహిళల ఆందోళన
* సమస్యలు తెలుకోకుండా మంత్రి యనమల వెళ్ళిపోయారని ఆగ్రహం
గుంటూరు (నగరంపాలెం): డ్వాక్రా రుణాల మాఫీ కేవలం ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమైందేగానీ ఆచరణలో అమలుకావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకర్లు వడ్డీతో సహా రుణాలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆవేదన చెందారు. రూ.25 వేలు రుణం తీసుకొని సీఎం చంద్రబాబు మాటలు నమ్మి ఒక నెల కిస్తీ చెల్లింపు ఆపినందుకు రూ.4500 వడ్డీ వసూలు చేశారని తెలిపారు. రెవెన్యూ మంత్రి జనచైతన్యయాత్రల్లో పాల్గొంటానికి వస్తున్నారని సమస్యలు చెప్పుకోవటానికి వస్తే ఆయన తన సమస్యలు ఏకరువు పెట్టి మా సమస్యలు తెలుసుకోకుండా వెళ్ళి పోయారని 47, 48 డివిజను మహిళలు ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాల మాఫీపై మహిళలు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు.
కట్టలు తెగిన ఆగ్రహం....
శనివారం ఉదయం 47,48 డివిజన్లలో తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్ధాళి గిరి ఆధ్వర్యంలో వసంతరాయపురం ఓంకారం గుడి వద్ద జరిగిన జనచైతన్యయాత్ర, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు సభలో పాల్గొంటారని డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలను తీసుకొచ్చారు. బి ఫారమ్ సమస్యలు, పసుపుకుంకమ కింద రుణాలు మంజూరు చేస్తారనీ చెప్పి ఉదయం 8.00 గంటలకు మహిళను ఆర్‌పీల ద్వారా అక్కడకు చేర్చారు. సమావేశం దగ్గరకు 11.15కి వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఽఉపన్యసించి ఇద్దరకి సభ్యత్వ నమోదు కార్డులు అందించి 11.40కి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దీంతో అక్కడ వేచి ఉన్న మహిళలకు ఆగ్రహం కట్టలు తెంచుకొని నియోజకవర్గ ఇన్‌చార్జి మద్ధాళిగిరి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబును చుట్టిముట్టి ఒక్కసారిగా మండిపడ్డారు.
మొదటి విడతే నిధులే రాలేదు...
ఉదయం నుంచి పనులు మానుకొని వస్తే కనీసం మంత్రి తమ సమస్యలు తెలుసుకోకుండా వెళ్ళిపోవటం ఏమిటని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాల రద్దుకి సంబంధించి రెండు విడతలు బ్యాంకులో జమ చేశామన్నారని, మాకు ఇప్పటికీ మెదటి విడత నిధులు కూడా రాలేదన్నారు. డివిజన్‌లలో జరిగే అభివృద్ధి పనుల నిర్మాణాలు సైతం నాణ్యత లేకుండా చేస్తున్నారని చెప్పారు. ఇవేమీ పట్టించుకోకుండా మంత్రి వెళ్ళిపోవడమేమిటంటూ నిలదీశారు.