పశువుల దాహం తీర్చేందుకు కొళాయి నుంచి మోటర్ ద్వారా నీరు నింపేందుకు వెళ్లిన విద్యార్థిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో విద్యుదాఘాతానికి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాడు. గంట ముందు వరకు తమతో సరదాగా గడిపిన మిత్రుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడే నీకు నూరేళ్లు నిండాయా నాయనా అంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించా
కనగానపల్లి: విద్యుత్ మోటర్ తీగ ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కొళాయి నీటిని మోటార్ ద్వారా పట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తూంచర్లకు చెందిన బిల్లే పెద్దన్న, నారమ్మ దంపతుల రెండో కుమారుడు బిల్లే సంతోష్ (12) ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పశువులపాక వద్ద తొట్టెకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో పంచాయతీ కొళాయి నుంచి నీరు తక్కువగా వస్తుండటంతో అక్కడే ఉన్న విద్యుత్ మోటర్ (జెట్ మోటర్) వేశాడు.
మోటర్ ఆన్ చేయగానే పైపు ఊడిపోయింది. దానిని తిరిగి అమర్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మోటార్ విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో విద్యుదాఘాతంతో విలవిలలాడి అక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత అటువైపు వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.