ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దళారీలకు వరంగా మారింది
హైదరాబాద్: ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దళారీలకు వరంగా మారింది. నోట్ల రద్దుతో చిల్లర దొరక్క తాత్కాలికంగా ఏర్పడిన సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవడానికి దళారీలు రంగ ప్రవేశం చేశారు. బ్యాంకులు కిక్కిరిసి ఉండటం, ఏటీఎంలలో డబ్బులు పెట్టిన వెంటనే ఖాళీ అవుతుండటం, ఒకవేళ కొత్త 2000 నోటు చేతికందినా.. చిల్లర కొరత ఉండటంతో మార్కెట్‌లో కొనుగోళ్లు, అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఇదే అదునుగా భావించిన దళారీలు 2000 రూపాయలకు చిల్లర కావాలంటే ఇస్తాం అంటూ బయలుదేరారు. రూ. 2000 ఇచ్చిన వారికి 1500 చిల్లర ఇస్తూ 'చిల్లర బిజినెస్' స్టార్ట్ చేశారు. కనీస అవసరాలకు కూడా చేతిలో బొత్తిగా చిల్లరలేని వాళ్లు ఈ దళారీలను ఆశ్రయించక తప్పడం లేదు. ఇలా రూ. 2000 కు 1500 చిల్లర ఇస్తున్న ఓ వ్యాపారిని లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 2,15,000 స్వాధీనం చేసుకున్నారు.